శివుని జటాజుటం నుండి గంగా ఆవిర్భావ వృత్తాంతము గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
గంగా రెండు భేదములు పొందినది అని అందులో ఒక భేదమును బ్రాహ్మణుడైన గౌతమ మహర్షి తీసుకుని రాగా రెండవ దానిని క్షత్రియులు తీసుకొనివచ్చారని అది కూడా శివ జటాజుటమున ఉన్నదని బ్రహ్మ ద్వారా తెలుసుకున్న నారదుడు రెండవ భేదమైన తీర్థం గురించి పూర్తిగా వివరించమని బ్రహ్మను కోరెను. ఆవిధముగా అడిగిన నారదునికి బ్రహ్మ గంగా ఆవిర్భావం గురించి వివరించెను.
వైవశ్వతమన్వంతరమున సూర్యవంశమున ఇక్ష్వాక కులములో పుట్టిన క్షత్రియునితో గంగ యొక్క రెండవ భాగము తేబడినది. ఇక్ష్వాక కులములో సగరుడు అను మహారాజు వలన సాగరము ఏర్పడినది. యజ్ఞశీలుడు, దానపరుడు, ధర్మాచారము, ధర్మ విచారము చేయగల సగర చక్రవర్తికి కేశిని, సుమతి అను ఇద్దరు భార్యలు కలరు. సంతానాన్ని కాంక్షిస్తూ సగర చక్రవర్తి కులగురువైన వశిష్ఠమహర్షిని ఆహ్వానించి యదావిధిగా పూజించి సంతతి గురించిన చింతనను అతనికి తెలుపగా భార్యలతో కలసి ఋషులను పూజించమని వశిష్ఠమహర్షి సగరునికి సూచించెను. కొంతకాలానికి తపోనిత్య అయిన ఔర్వ మహర్షి సగరుని ఇంటికి రాగా రాజు తన భార్యల తో కలసి చక్కగా ఔర్వునిని పూజించెను. సంతసించిన మహర్షి వరమును కోరుకోమనగా తనకు పుత్రులు కావలెనని సగరుడు కోరెను.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి