Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : కార్తిక బహుళ ఏకాదశి (ఆడి యోతో…)

కార్తిక బహుళ ఏకాదశి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ

కార్తిక బహుళ ఏకాదశిని రమా ఏకాదశి అని కూడా అంటారు. రమా ఏకాదశి మహాపాపములను హరించునని పద్మపురాణమున ఉత్తర ఖండంలో వివరిం చబడినది. ఈ పురాణమున ఏకాదశీ మాహాత్మ్యము గూర్చి ఈ విధంగా తెలుపబడింది.

ఇక్ష్వాక మహారాజు పుత్రుడు ముచుకుందుడు అను మహారాజు విష్ణుభక్తుడు మరియు సత్యసంధుడు.అతని పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఈయన పుత్రిక ఉత్తమురాలైన చంద్రభాగను చంద్రసేన పుత్రడు శోభనునికిచ్చి వివాహము జరిపించెను. విష్ణు భక్తుడైన ముచుకుందుని రాజ్యంలో శ్రీహరి దినమైన ఏకాదశి నాడు అందరూ నియమనిష్ఠలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించెదరు. అదేరోజు శోభనుడు మామగారి రాజ్యానికి వేంచేయగా తన భర్త ఆకలికి తాళలేడని తెలిసిన చంద్రభాగ చింతి ంచెను. ఉపవాసంతో తన ప్రాణాలు హరించునని, తగిన ఉపాయమును సూచించమని శోభనుడు తన భార్యను కోరెను. కానీ ఆ రాజ్యంలో ఏకాదశినాడు పశుపక్ష్యాదులు సైతం ఆహారపానీయాలకు దూరంగా ఉంటాయి కావున దీనికి తరుణోపాయము లేదని చంద్రభాగ వాపోయెను. ధృడనిశ్చయంతో, సంకల్ప బలంతో ఉపవసించవలసిందిగా తన భర్తను కోరెను. దైవము సంకల్పించినది తప్పక జరుగునని విధిలేని పరిస్థితులలో శోభనుడు ఉపవసించెను. ధృడమైన సంకల్పంతో ఏకాదశి నియమాన్ని ఆచరించిన శోభనుడు ఆకలికి తాళలేక మహాదు:ఖము అనుభవించెను. విష్ణు భక్తులు ఏకాదశినాడు రాత్రంతా సంతోషంగా హరిపూజతో జాగరణ చేస్తారు. కాని శోభనుడు ఆకలితో కలిగిన దు:ఖాన్ని తట్టుకోలేక సూర్యోదయ సమయానికి మరణించెను. మహారాజు సకల రాజలాంఛనములతో అంత్యక్రియలు జరిపించగా చంద్రభాగ స్థిరనిశ్చయంతో భర్తకు చేయవలసిన అన్ని ఉత్తర క్రియలు జరిపించి తండ్రి రాజ్యంలోనే నివసించెసాగింది.

‘రమాఏకాదశి’ ప్రభావంతో శోభనుడు మందర పర్వత శిఖరముల మీదున్న దేవపురమునకు చేరెను. ఈ పురము హేమ స్థంభములతో అలంకరించబడి లెక్కలేనన్ని గుణములతో నున్న భవనమున వివిధ ఆకారములతో ఉన్న స్ఫటికములతో కూర్చబడిన సింహాసమును శోభనుడు అధిరోహించెను. గంధర్వులచే స్తోత్రము చేయబడుచూ అప్సరసలు వంటి స్త్రీలతో సేవించబడుతూ కుబేరునిలా రాజభోగములను అనుభవించచుండెను.

ముచుకుం దుని రాజ్యంలో సదాచార సంపన్నుడు జపతపోనిష్ఠ పరాయణుడైన సోమశర్మ తన తపప్రభావంతో తీర్థయాత్రలు చేస్తూ మందర పర్వతము పైనున్న దేవపురమునకు చేరెను. అక్కడ శోభనుడిని కలిసిన సోమశర్మ అద్భుతమైన ఈ నగరానికి ఎలా చేరావని ప్రశ్నించెను. అపుడు తాను రమా ఏకాదశినాడు ఉపవసించిన ఫలితమున ఈ నగరమునకు చేరెనని, రమాఏకాదశి వ్రతాన్ని తాను శ్రద్ధతో ఆచరించలేదు కావున ఈ భోగం ధృవం కాద(అశాశ్వతం)ని, తన భార్య చంద్రభాగకు ఈ విషయాన్ని తెలియజేసి ఆమెను తన వద్దకు తీసుకొని రమ్మని సోమశర్మని కోరెను. చంద్రభాగ నియమనిష్టలతో రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది కావున ఆమెకి లభించే వ్రతఫల ప్రభావం తన భర్త అయిన తనకు కూడా ఉంటుందని తద్వారా తాను నివసించే నగరం శాశ్వతమౌతుందని తలంచెను. తిరిగి రాజ్యానికి చేరిన సోమశర్మ చంద్రభాగకు విషయం తెలియజేసి ఆమెను మందరాచలం మీదున్న వామదేవ మహర్షి ఆశ్రమానికి తీసుకొని వెళ్లగా మహర్షి ఆమెను వేదమంత్రములతో అభిషేకించగా ఋషిమంత్రము మరియు రమాఏకాదశి ప్రభావంతో చంద్రభాగ దివ్యదేహమును పొంది భర్త సమీపమునకు చేరెను. చంద్రభాగ తన 8వ ఏట నుండి యధోక్త విధిగా రమాఏకాదశి వ్రతాన్ని ఆచరించింది కావున ఆ పుణ్యప్రభావంతో దేవపురమును ధృవం చేసి భర్తతో కలిసి సుఖంగా ఉండెను.

- Advertisement -

రమా ఏకాదశి చింతామణి, కామధేనువు వంటిది కనుక కోరికలను నెరవేర్చును. ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేని వారు ఏకాదశివ్రత మహాత్మ్యమును వినినా వ్రత ఫలితమును పొందుతారు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement