Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : దీపావళి పర్వదిన విశిష్టత మరియు అంతరార్థం (ఆడియోతో…)

దీపావళి పర్వదిన విశిష్టత మరియు అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ..

ఆశ్వయుజం అనగా గుఱ్ఱముల పూనిక. గుఱ్ఱములు అనగా మన ఇంద్రియాలు. ఆ గుఱ్ఱాలను మనస్సు అనే పగ్గాలతో కట్టి శరీర రథాన్ని పరమాత్మ వైపు పయనింప చేయాలి. ఈ ప్రయాణంలో చీకటిని సుదర్శనంతో అనగా చక్కటి జ్ఞానంతో తొలగించడం నరకాసురుని వధ. అజ్ఞానం, చెడు, దు:ఖం తొలగితే ప్రసరించే వెలుగురేఖలే, ప్రతీ గుమ్మంలో వెలిగే దివ్వెలు అవే ప్రతీ హృదయంలోని మంగళహారతులు, అదే దీపావళి.

అమావాస్యనాడు దీపావళి కానీ, ఆనాటి రాత్రి శతకోటి పున్నముల సమాహారం. ప్రతీ ఇంటి ముంగిలిలో దీపాల వెలుగులే. ఆరోజు రాత్రి జాగరణతో లక్ష్మీనారాయణులను శక్తిమేరకు విభవానుగుణంగా ఆరాధన చేసి మంగళవాయిద్యాలు మోగించాలి. ఈనాడు ట పాసులు కాల్చడం ఆనవాయితీగా మారింది. ధ్వనితో నిశబ్ధాన్ని, వెలుగుతో చీకటిని, హారతితో అభిరతిని తొలగించుకొని జ్ఞానప్రసూనాలను వెదజల్లుతూ ఊరూవాడా అంతటా దీపాలను వెలిగించి మధుర పదార్థాలను పంచుకోవడం ఆనవాయితీ. మధురం అనగా ‘జ్ఞానమే’నని జ్ఞానం ఉన్నచోట చేదు ఉండదని లోకానికి చాటిచెప్పే పండుగ దీపావళి.

నరకాసురిడి సంహారంతో జనాల్లో, జగాల్లో వెలుగు నిండింది. మనస్సులో నిండిన వెలుగు దీపాల రూపంలో బయట ప్రసరించింది. లోకాన్ని పీడించే వారు నశిస్తే ఆనందమే కావున ఒక్కొక్కరి సంతోషం ఒక్కొక్క దీపం, అందరి సంతోషమే దీపావళి. మన ఇంటి ముంగిలిలో ఎన్ని దీపాలు వెలిగిస్తామో అన్ని మధుర పదార్థాలు పదిమందికి పంచాలని పూర్వాచారం. తీపి నాలుకకే కాక మనస్సుకు అంది అది బుద్ధి దాకా చేరాలి. తీయని మనస్సును మించిన దీపం లేదు. పదిమందికి జ్ఞానాన్ని పంచే బుద్ధే అఖండజ్యోతి. ఇదే అమావాస్యనాడు అఖండజ్యోతిలోని అంతరార్థం.

- Advertisement -

దీపావళి నాడు దీపారాధన చేసే సమయంలో పఠించవలసిన శ్లోకాలు..

దీపాగ్రే వర్తతే విష్ణు:
దీప మధ్యే మహేశ్వర:
దీపాంతే చ తదా బ్రహ్మా
దీపం త్రైమూర్తికం విదు:

తాత్పర్యం : దీపం అగ్ర భాగం విష్ణువు, మధ్య భాగాన మహేశ్వరుడు, దీపం కింది భాగాన బ్ర హ్మ కొలువై ఉంటారు. దీపం త్రిమూర్తిమయం. దీప ప్రజ్వలన త్రిమూర్తి ఆరాధన.

దీపాగ్రే వర్తతే లక్ష్మీ
దీప మధ్యేచ పార్వతీ
దీపాంతే శారదా ప్రోక్తా
దీపం శక్తి మయం విదు:

తాత్పర్యం : దీపం అగ్ర భాగాన ల క్ష్మీ, మధ్య భాగాన పార్వతీ, దీపం కింది భాగాన సరస్వతి. దీపం త్రిశక్తి మయం. దీప ప్రజ్వలన త్రిమాతల ఆరాధన.

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement