గాయత్రీదేవి అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ
గాయత్రీ దేవి
హిరణ్యగర్భ విద్యననుసరించి వేదశాస్త్రములు, సకల జగత్ సృష్టికి సూర్యుడే ఆధారం. సూర్య మండలం ఆగ్నేయమున ఉంది కావున దీనిని హిరణ్మయము అని అందురు. ఈ హిరణ్మయ మండల కేంద్రమున సూర ్య రూపుడైన పరబ్రహ్మతత్త్వము ప్రతిష్టించబడింది కావున, బ్రహ్మను హిరణ ్యగర్భుడు అంటారు. ఈ సూర్యభగవానుని శక్తే (అతని కాంతియే) గాయత్రీ. ఈమెకు మరో పేరు సావిత్రి. సావిత్రి అనగా ‘సవిత: ఇయం’ అని వ్యుత్పత్తి. సవిత అనగా సూర్యుడు. సూర్యకాంతి, సూర్యతేజస్సే సావిత్రి. సూర్యశక్తిని తార, గాయత్రి, సావి త్రి అని అంటారు. సూర్యభగవానుడు బృహతీ అను మహా విశ్వగోళ మధ్యభాగంలో స్థిరంగా ఉంటూ లోకాన్ని ప్రకాశింపచేస్తాడు.
” సవితు: వరేణ్య భర్గ: ధీమహి | యోన: ధియ: ప్రచోదయాత్ ||” అని మంత్రము.
ఈవిధంగా సూర్యభగవానుని సర్వశ్రేష్ఠమైన తేజస్సును ధ్యానం చేయడం ద్వారా ఆ తేజస్సే మన బుద్ధిని మంచి దారిలో ప్రేరేపించునని గాయత్రీ మంత్రార్థము. ఇతర ఆగమములానుసారం నారాయణుని రూపమే సూర్యభగవానుడు. కావున నారాయణుని దివ్యకాంతియే గాయత్రీ. గాయత్రీ అనగా ‘గాయంతం త్రాయత ఇతి గాయత్రీ’ అనగా గానము, ధ్యానము చేసేవారిని రక్షించేది.
స్త్రీ రూపమైన గాయత్రీ ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ ఛాయై: అని ఐదు రంగుల గల ఐదు ముఖములు అలాగే చంద్రశేఖర తత్త్వమున మూడునేత్రములను, పది చేతుల్లో పది రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ రూపం పరమాత్మను చేరవలసిన జీవాత్మ స్వరూపం. అమ్మ ఐదు ముఖాలలో ‘ముక్త’ పరమాత్మ స్వరూపం, ‘విద్రుమ’ జీవాత్మ స్వరూపం, ‘హేమ’ ప్రాప్తి ఉపాయం, ‘నీలం’ ప్రాప్తికి విరోధి, ‘ధవళ’ ప్రాప్తి ఫలం. పది చేతులలోని పది ఆయుధాలు ఇంద్రియాలు చేయవలసిన పది పనులు. జిహ్వ, నాసిక, నేత్రములు మొదలగు ఈ పది ఇంద్రియములు పరమాత్మ యొక్క సేవకు, ధ్యానించుటకు ఉపయోగించాలి. ఈవిధంగా ఇంద్రియాలనే చేతులలో కర్తవ్యాలను ఆయుధాలుగా చేసుకుని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ద్వేష, అసూయ, ఈర్ష్య, స్వార్థం అనే పదిమంది శత్రువులను గెలవాలని గాయత్రీ మాత అవతార ఉపదేశం. ఈ సత్యాన్ని తెలుసుకుని ఆచరించి, అనుసరించి అమ్మ అనుగ్రహం పొందాలి.
నైవేద్యం : పాయసం, లడ్డూలు
— శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్య..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి