మహాభారతం, శాంతిపర్వంలోని సుభాషితం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
క్షమ
కృద్ధే స్మేర ముఖావధారణం అధోద్విష్టే ప్రసాదక్రమ:
వ్యాక్రోషే కుశలోక్తి: ఆత్మదురితచ్చేదోత్సవ: తాడనే
దిక్ జంతో: అజితాత్మన: అశ్య మహాతో దైవాదపేతావిపత్
దూర్వారాతి దయా రసాద్ర మనస: క్రోధస్య కుత్రో దయ:
నివారింప శక్యం కాని గొప్ప దయా రసంతో తడిసిన మనస్సు కలవాడు ఎదుటి వారి కోపగించినపుడు ముఖముపై చిరునవ్వును పొడచూపుట, ద్వేషించిన వారి విషయమున ప్రసన్నత కనబరుచుట, బాగా అరుస్తూ నిందించేవాడితో నాయనా క్షేమంగా ఉన్నావా! అని కుశల ప్రశ్నలు వేయుట, ఎదుటివారు తనను కొట్టినపుడు ఆహా! నా పాపం తొలగిపోయిందని పండుగ చేసుకొనుట, మనస్సు జయించలేని ఈ మహానుభావుడికి దైవమే ఆపదను తొలగించుగాక! అని ఆశీస్సులు అందించుట, ఈ విధంగా చేయువానికి కోపం కలిగే అవకాశం ఎక్కడిది?
ఎదుటి వారు కోపించినపుడు దాన్ని చూసి తాము కూడా కోపించకుండా ఉండే వారు తమను ద్వేషించిన వారిపై ప్రసన్నముగా ఉండేవారు, ఎదుటివారి కోపానికి ప్రతిక్రియ ఆచరించని వారి కోపము నిరర్ధకమగును. మరల కోపాన్ని ప్రదర్శించకుండా ఉండాలంటే గొప్ప దయ ఉండాలి. అజ్ఞాని కోపిస్తాడు కానీ జ్ఞాని ఎప్పుడూ కోపించడు. మనపై ఎదుటివారు కోపాన్ని ప్రదర్శించినపుడు అయ్యో! వీరు అజ్ఞానముతో బాధపడుతున్నారని వీరికి భగవంతుడు జ్ఞానం కలిగించాలని వారిపై దయ కలగాలి. ఎదుటివారు తనను కొట్టినపుడు ఆ బాధను అనుభవించడమంటే తాను చేసిన పాపము నశించినట్టే. ఎదుటివారు తనను కొట్టి బాధపెట్టినా పాపాన్ని నశింపచేశారని పండుగ చేసుకోవాలి. కావున కొట్టడం అనేది ఉపకారమే కానీ అపకారము కాదు. జ్ఞానం లేని వారే ఇంత ఉపకారము చేస్తే వీరికి జ్ఞానం కలిగితే లోకానికి ఎంత ఉపకారము చేస్తారో అని భావించి వారికి ఆపదలను తొలగించమని భగవంతుని ప్రార్థించు వారికి ఎదుటివారు ఏమి చేసినా కోపం ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? ఇలా ఉండటమే అసలైన క్షమ.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి