మహాభారతం, శాంతిపర్వంలోని సుభాషితం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
తపస్సు
వనేపి దోషా: ప్రభ వంతి రాగిణాం గృహేషు పంచేంద్రియ నిగ్రహ: తప:
అకుత్సితే కర్మణి య: ప్రవర్తతే నివృత్త రాగస్య గృహం తపోవనమ్
కోరికలు గల వాడు అడవిలో ఉన్నా పాపకర్మలు చేయుచూనే ఉండును. ఇంద్రియ నిగ్రహం కలవాడు ఇంట్లో ఉన్నా తాను చేయుచున్నది తప్పస్సు అగును. సాధించ దగ ని పనులు ఆచరించువారికి, దేని యందు కోరిక లేని వారికి ఇల్లే తపోవనమగును.
మనస్సులోని అనంతమైన కోరికలను నిలుపుకొని వాటిని తీర్చుటకు ప్రయత్నము చేయుచున్న వారు అడవిలో ఉన్నా శరీరానికి కావాల్సిన వాటిని, మనస్సు కోరిన వాటిని సాధించుటకు ప్రయత్నించును కానీ పరమాత్మ యందు మనస్సు నిలుపలేరు. అనగా కోరికలు గల వారికి అడవిలో ఉన్నా దోష ప్రవృత్తే ఉండును. ఇక ఇంద్రియ నిగ్రహం కలవారు మనస్సును జయించిన వారు ఆ మనస్సులో నిరంతరం పరమాత్మను చూసే వారు ఇంటిలో ఉన్నా వారు చేసేది తపస్సే. భగవంతుని ఆరాధనలో, భక్తుల ఆరాధనలో ఉండువారు చెడు పని ఎప్పుడూ చేయరు కావున అలాంటి వారిలో అన్ని కోరికలు తొలగును. కావున వారికి ఇల్లే తపోవనము. మనస్సులో ఉండే కోరికలను అడవిలోనికి పంపాలి కాని కోరికలు ఉన్న శరీరాన్ని అడవికి పంపుట తపస్సు కాదు. కోరికలు లేని శరీరము, మనస్సు ఉన్నవారు ఇంట్లో చేసే ప్రతీ పని తపస్సే అవుతుంది.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి