Friday, November 22, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – అధర్మ పద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

శారీరై: కర్మదోషైశ్చ యాతి స్థావర తాం నర:
వాచికై: పక్షిమృగతాం మానసై ర్భూతప్రేతతామ్‌

శరీరముతో చెడుపనులు చేసినచో స్థావరములుగా పుట్టును. వాక్కుతో దోషములాచరించినచో పక్షులుగా, మృగములుగా పుట్టును మనస్సుతో తప్పు చేసినచో భూతప్రేత పిశాచములుగా పుట్టును.

ప్రతీ ప్రాణి పనిచేసేది మూటితోనే, శరీరము, వాక్కు మరియు మనసుతో. ఎదుట వాని వస్తువులను అపహరించుట, ఆహారపానీయాలలో, ఇంటికి నిప్పు పెట్టుట, ధన కనక వస్త్రాదులను అపహరించుట, భార్యాపుత్రాదులను చంపుట, ఇల్లు కూల్చుట ఇవన్నీ శరీరంతో చేసే దోషాలు. ఇలా చేసిన వారు కదలిక లేని వృక్షములుగా, పర్వతములుగా, రాళ్లుగా, బల్లలుగా, కుర్చీలుగా పుడతారు. శరీరముతో దోషము చేస్తే మరు జన్మలో శరీరముతో పనిచేయజాలరు. ఇక వాక్కుతో దోషములను చేసినచో అనగా అబద్ధమును చెప్పుట, ఎదుటి వారిని దూషించుట మున్నగునవి చేసిన వారు మూగ జీవులైన పక్షులు లేదా మృగములుగా పుట్టును. భగవంతుడిచ్చిన మాటలాడు శక్తిని నలుగురి మేలుకు వాడితే ఉత్తమునిగా, ఉపాధ్యాయునిగా, శాసకునిగా పుడతారు. మనసుతో తప్పుచేసినచో అనగా పరస్త్రీలను, పరుల ద్రవ్యములను ఆశించుట. పరులకు హాని కలిగించాలని సంకల్పించినచో సంకల్పించు శక్తి లేని భూతప్రేత పిశాచములుగా పుట్టెదరు. ఇట్టి దోషము చేసిన వారు అవయవము పని చేయని ప్రాణిగా పుట్టుదురు. అందుకే అన్ని అవయవములతో అన్ని భాగములతో ధర్మమునే ఆచరించినచో సర్వావయవ సామర్థ్యము, సర్వావయవ సంపూర్ణతో, సర్వావయవ శోభతో పుట్టుదురు. మనకు ఈ జన్మలో శరీరములోని ఏ భాగానికి బాధ కలుగుతుందో పూర్వ జన్మలో ఆ భాగముతో పాపమును చేసినట్లు తెలుసుకోవలెను.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement