Friday, November 22, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 23 (ఆడియోతో…)

పద్మపురాణంలో వివరించిన రామచంద్ర: అను పదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

రాతి కుక్షౌ విశ్వం గృహ్ణాతి ప్రళయే ఇతిర:
అమ్యతే ప్రాప్యతే భక్త్యాదినా ఇతి అమ:
రశ్చ అసౌ అమశ్చ రామ: జగత్‌ జన్మాది హేతు:
చంద్రతి ఆనంద యతి లోక్యం ఇతి చంద్ర:
రామశ్చ అసౌ చంద్రశ్చ రామచంద్ర:

ఈ శ్లోకము రామచంద్ర అను శబ్ధానికి అర్థం.
‘రా’ అనగా రా దీప్తి ఆదానయో: అనే ధాతువు వలన ఏర్పడినది. ‘రాతి’ అనగా ప్రపంచమును లేదా విశ్వమునను ప్రళయ కాలంలో తన కడుపులోనికి తీసుకునేవాడని అర్థం. అలాగే ‘రాపయతి’ అనగా సృష్టి కాలంలో సకల జగత్తును బయటకు ప్రకాశింపచేసేవాడని అర్థం. ఈ విధంగా ‘రా’అనే దానికి సకల జగత్తును ప్రళయ కాలంలో తన కడుపులో దాచుకుని సృష్టి కాలంలో బయటకు ప్రకాశింపజేసి దానిని రక్షించే వాడని, అలాగే ‘రా’ అన్న దానికి సృష్టి, స్థితి, లయములను చేయువాడు అని అర్థం. ఇక ‘అమ’ అన్న పదానికి ‘అమగత్యాదే’ అనే ధాతువుతో భక్తి మొదలగు వాటితో పొంద తగినవాడు అని అర్థం. ఈవిధంగా ‘రామ’ అన్న దానికి జగత్‌, జన్మ, స్థితి, లయ కారకుడు, సంసారము వీడిన ముక్తులచేత పొందదగిన వాడు అని అర్థం. ఇక ‘చంద్రతి ఇతి చంద్ర: అనగా ఆనందింప చేయువాడని అర్థం. ఇలా రామచంద్ర: అంటే సకల విశ్వమును సృష్టించి, రక్షించి, సంహరించువాడు, సకల జగత్తును ప్రళయకాలంలో కడుపులో దాచుకుని సృష్టి కాలంలో బయటకు ప్రకాశింప చేసి రక్షించువాడు, భక్తి మొదలగు వాటితో ముక్త జనులకు పొందదగిన వాడు అని అర్థం. అన్ని లోకములను ఆనందింపజేయువాడని రామచంద్ర అను శబ్ధమునకు నిఘంటువు చెప్పిన అర్థం. ఇవన్నీ చేయదగినవాడు పరమాత్మ కావున రామచంద్ర అనే శబ్ధానికి పరమాత్మ అనునది నిశ్చితార్థం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement