గరుడపురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….
దురాచారోపి సర్వాశీ కృతఘ్న: నాస్తిక: శఠ:
సద్య: పాపాద్విముచ్ఛేత ప్రభావాత్ పరమాత్మన:
పశుపక్ష్యాదులు, వృక్షాలు తినే ఆహారాలను ఎలాంటి నియమనిషేధాలు లేకుండా తినేవాడు సర్వాశీ అనగా అన్నీ తినేవాడు. వండిన పదార్థములను మూడు గంటలు నిల్వ ఉన్న తరువాత తిన రాదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. స్మశానానికి దగ్గరగా పండిన ధాన్యంతో వండినవి, దొంగతనం చేయబడి తెచ్చినవి, రాజస, తామస ఆహారం తినరాదని శాస్త్రం. అలాగే భోజనం ముందు కూర్చుని అత్యవసర పరిస్థితిలో భోజనం పూర్తికాకుండానే సగంలో లేచి మళ్ళీ ఆ భోజనం చేయరాదు. ఆ విధంగా తినడాన్ని వాంతాడి అనగా మనం వాంతి చేసుకున్న ఆహారాన్ని మనమే భుజించినట్టు అని వ్యాసుడు పేర్కొన్నాడు. ఇలాంటివి తినే వారిని సర్వాశి అంటారు.
కృతజ్ఞుడైనా, నాస్తికుడైనా పరమాత్మ ప్రభావం వలన వారికి తెలియకుండానే రావి చెట్టుకింద కూర్చుంటారు, గంగలో స్నానమాచరిస్తారు, దేవుని ప్రసాదమని తెలియకనే ఆకలిని చల్లార్చుకొనుటకు ఆ ప్రసాదాన్నే తీసుకుంటారు. పరిస్థితుల ప్రభావంతో ఏకాదశినాడు ఉపవాసం చేస్తారు. ఎదుటి వారిని నిందించడానికి, వారి పేరు నారాయణ అయితే ఆ పేరును వందసార్లు పలుకుతూ నిందిస్తారు. ఈవిధంగా పరమాత్మ వారిని బాగుచేయాలనుకుంటే వారి దురాచారాన్ని సదాచారంగా మార్చి సర్వాశత్త్వాన్ని పుణ్యాశిగా చేసి పాపాలను తొలగిస్తాడు.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి