Saturday, November 23, 2024

ధర్మం – మర్మం :

గౌతమీ, గంగా స్నాన ఫలము గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

శంకరుడు గౌతమునితో గౌతమీ, గంగా స్నాన ఫలమును ఈ విధంగా వివరించెను.

నర్మదాతు నదిచ్ఛ్రేష్ఠా పర్వతే అమర కంటకే
యమునాసంగతాతత్ర ప్రభాసేతు సరస్వతీ
కృష్ణా భీమరధీ చైవ తుంగభద్రాతు నారద!
తిసృణాం సంగమోయత్ర తత్తీర్ధం ముక్తిదం నృణామ్‌
పయోష్ణీ సంగతాయత్ర తత్రత్యా తచ్చముక్తిదమ్‌
ఇయంతు గౌతమీ వత్స యత్రక్వాపి మమాజ్ఞయా
సర్వేషాం సర్వదానౄణాం స్నానా న్ముక్తిం ప్రదాస్యతి
కించిత్కాలే పుణ్యతమా కించి త్తీర్థం సురాగమే
సర్వేషాం సర్వదా తీర్ధం గౌతమీనా త్రసంశయ:
షష్ఠి ర్వర్ష సహస్రాణి భాగీరథ్యవగాహనమ్‌
సకృద్గో దావరీ స్నానం సింహస్థేచ బృహస్పతౌ
విశేషాద్రామ చరణ ప్రదానాత్‌ తీర్థ సంశ్రయాత్‌
సింహస్థితే సురగురౌ దుర్లభా గౌతమీనృణామ్‌

తాత్పర్యము : నదీ శ్రేష్టమైన నర్మద అమర కంటక పర్వతమున ఉత్తమ ఫలమును ఇచ్చును. యమున సంగమమున ఉత్తమ ఫలమును ఇచ్చును. ప్రభాస తీర్థమున సరస్వతీ నదీ ఉత్తమ ఫలితము ఇచ్చును. ఇక కృష్ణా, భీమరథీ, తుంగభద్రా ఈ మూడు సంగమమున విశేష ఫలమును ఇచ్చి, ముక్తిని ప్రసాదించును. పయోష్ణీ నది కూడా సంగమ తీర్థమున ముక్తిని ప్రసాదించును. కానీ ఈ గౌతమీ నది ఎక్కడైనా నా (శంకరుడు) ఆజ్ఞతో అన్ని చోట్లా అందరికీ అన్ని కామనలను ప్రసాదించి ముక్తిని అనుగ్రహించును. కొన్ని నదులు, కొన్ని సమయములలోనే పవిత్రములు మరికొన్ని నదులు దేవతా ఉత్సవములలో పవిత్రములు కాని గోదావరీ నది అన్ని సమయములలో అన్ని ప్రదేశములలో అందరికీ స్నానముతో ముక్తిని ప్రసాదించును. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి నదీ స్నానము అరవై వేల సంవత్సరములు గంగా నదిలో స్నానము చేసిన కలుగు ఫలితము లభించును. శ్రీరామ పాద స్పర్శ గల గోదావరీ నది బృహస్పతి సింహరాశిలో ఉండగా ఎంతో పుణ్య ఫలము ఉంటేనే మానవులకు లభించును.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement