Friday, December 20, 2024

ధర్మం – మర్మం : దుష్ట సంహారంలో దాగి యున్న రహస్యం (ఆడియోతో…)

దుష్ట సంహారంలో దాగి యున్న రహస్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

రాక్షసులంతా పూర్వము శ్రీమన్నారాయణుని సేవకులే. శ్రీహరి ద్వారపాలకులైన జయవిజయలు ఋషుల శాపం వలన రాక్షసులుగా జన్మించారు. కానీ వారికి కావలసింది శ్రీహరి సేవ, అదీ వైకుంఠంలో. అసుర దేహం ఉన్నతంత వరకు వారు శ్రీహరిని చేరలేరు. స్వామిని విడిచి అంతకాలం ఉండలేని వాళ్లమని అసుర దేహాన్ని వైరంతో తమరే తొలగించి తమసాన్నిధ్యాన్ని ప్రసాదించాలని స్వామిని ద్వారపాలకులే కోరారు. కావున అసుర దేహాన్ని తొలగించి దివ్య దేహాన్ని ప్రసాదించి మళ్ళీ వారి సేవలో వారిని ఉంచాడు కావున నిజానికి శ్రీమన్నారాయణుడు చేసింది సంస్కరణ. ఆత్మకు అసుర దేహ మాలిన్యాన్ని తొలగించి దివ్య దేహాన్ని ప్రసాదించుట సంస్కరణ. ప్రాకృత శరీరాన్ని తొలగించి దివ్య దేహాన్ని అందించటం ఆత్మ సంస్కారం. జీవునికి కర్మ వశమున వచ్చిన పుట్టుక మాలిన్యం కావున ఆ దేహాన్ని తీసివేసి అనగా సంస్కారం చేసి దివ్య దేహాన్ని అనగా శ్రీహరిని సేవించ గల దాన్ని ప్రసాదిం చడం సంస్కారమే.

ఆత్మ తెచ్చుకొన్న కర్మ వశమున కలిగిన దేహాన్ని అంతము చేసి జ్ఞాన దేహాన్ని, దివ్య దేహాన్ని అందీయుట అంటే ముక్తిని అందించటం సంస్కరణ. ఆ దేహాన్ని తీసేయకుండా మంచి బుద్ధి చెప్పి బుద్ధిమంతునిగా బ్రతుకుట సంస్కారము అనుకుంటే ఆ మంచి బుద్ధితో ఉన్నవాడు ఎన్నో జన్మల వరకు స్వామిని చేరలేడు. ఎక్కువ కాలం ఈ పాంచ భౌతిక దేహంతో ఈ సంసారం లో భగవంతునికి దూరంగా అంటే ముక్తికి దూరంగా ఉంచేది సంస్కరణ అనుకుంటే ఆ సంసారాన్ని ఎవరు కోరరు. ఒకసారి భగవంతుని సేవను రుచి చూచిన వారు అదిలేకుండా బ్రతుకలేరు. అందుకే వారికి త్వరగా దేహాన్ని తద్వారా పాపాన్ని తొలగించి సంస్కరించారు స్వామి. సంహారం అంటే సంస్కారమే, అయితే భగవానుడు చేసిన సంహారమే ముక్తిదాయకము కాన సంస్కార ము. రాగద్వేషాలతో పరస్పరం వధించుకొనుట సంస్కారం కాదు, అది మళ్లిd పాపమే. దేహానికి పుట్టుక సంసారం, మరణం సంస్కారం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement