అస్మద్గురుభ్యోనమ:
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారు అందిస్తున్న అదజన్మాష్టమీ వివరణ..
జన్మాష్టమీ కృష్ణాది మాసనామములతో భాద్రపద కృష్ణపక్ష అష్టమీ కృష్ణాష్టమీ.
తథా భాద్రపదే మాసి కృష్ణాష్టమ్యాం కలౌ యుగే |
అష్టావింశతి తమే జాత: కృష్ణోసౌ దేవకీసుత: ||
అని కల్పతరువులో చెప్పబడింది. 28వ ద్వాపరయుగమున భాద్రపద కృష్ణపక్ష అష్టమినాడు దేవకీ పుత్రునిగా కృష్ణుడు అవతరించాడు. ఇక్కడ మతభేదముంది. అష్టమి రెండు విధములు. జన్మాష్టమి, జయంతి అని. జన్మాష్టమి అనునది కేవలం భాద్రపద బహుల అష్టమి. రోహిణీ నక్షత్రముతో కూడిన అష్టమిని జయంతి అంటారు. న్యాయంగా రెండు వ్రతములు జరుపుకోవాలి. జన్మాష్టమీవ్రతం చేసుకోవాలి. జయంతి ఉత్సవం చేసుకోవాలి. రోహిణి నక్షత్రము పవలున్నా, రాత్రి ఉన్నా జయంతి జరుపుకోవాలి.
దివా వా యది వా రాత్రౌ నాస్తి చేద్రోహిణీ కలా |
రాత్రియుక్తాం ప్రకుర్వీత విశేషేణందు సంయతా ||
అనగా పవలు కాని, రాత్రి కాని రోహిణీ నక్షత్రము లేనిచో రాత్రి యుక్తమైన అష్టమిని ఆచరించాలి. శ్రావణ
బహులాష్టమి, శ్రీకృష్ణాష్టమీ, భాద్రపద బహులాష్టమి, రోహిణీయుత శ్రీకృష్ణ జయంతి, సింహమాసము కావలయును.
సింహమాసే అసితే పక్షే రోహిణ్యా మష్టమీ తిథౌ |
చరమార్ధ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురుమ్ ||
అని పురాణ సంప్రదాయ వచనం. సౌరమానము ప్రకారము సింహమాసమున అనగా సూర్యుడు
సింహరాశిలో ప్రవేశించిన తరువాత కృష్ణపక్షమాష్టమి రోహిణీ నక్షత్రమున అవతరించినవాడు శ్రీకృష్ణుడు. సామాన్యంగా చాలామార్లు శ్రావణ మాసములోనే సింహ సంక్రమణం వస్తుంది. అందుకే అధిక శాతం శ్రావణ బహుల అష్టమినాడే శ్రీకృష్ణాష్టమి ఆచరిస్తారు. కాని వైష్ణవ సంప్రదాయం ప్రకారం పుట్టినరోజు అనగా తిథిని వైష్ణవులు ఆచరించరు. పుట్టిన నక్షత్రాన్ని ఆచరిస్తారు. అందుకే తిరునక్షత్రం అంటారు. శ్రావణమాసమైన, భాద్రపద మాసమైన కృష్ణపక్షంలో అష్టమి కాని, లేక నవమి కాని రోహిణీ నక్షత్రయోగమున్నపుడు శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తారు. ఈసారి శ్రావణ మాసంలో సింహసంక్రమణం రాలేదు. అది శ్రావణ బహుల అష్టమి సింహసంక్రమణం లేదు. అనగా శ్రావణ బహుళ అష్టమి నాటికి సింహ సంక్రమనం లేదు. ఇంకా అష్టమినాడు, నవమి నాడు కూడా రోహిణి లేదు. ఇన్ని కారణాల వలన శ్రావణ కృష్ణాష్టమినాడు కేవలం కృష్ణ జన్మాష్టమీ వ్రతాన్ని ఆచరించారు. భాద్రపద బహుల అష్టమి 10.9.2020 నాడు రోహిణీనక్షత్ర యోగము కూడా ఉంది. అందువలన శ్రీవైష్ణవులు సంప్రదాయము తెలిసినవారు భాద్రపద బహుల అష్టమీ రోహిణీ కావున ఆనాడు శ్రీవైష్ణవక్షేత్రములలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాన్ని ఆనందకోలాహముతో జరుపుకుంటారు. అందులో శ్రీకృష్ణ జయంతి బుధవారం వస్తే వైశ్యులు, క్షత్రియులు వృద్ధిపొందుతారని, గురువారం శ్రీకృష్ణజయంతి బ్రహ్మరుద్రాదులకు కూడా లభించదు అని పురాణ వచనం. గురువారం శ్రీకృష్ణాష్టమి జయంతి ప్రాప్తిస్తే ఇది కోటి జన్మల ఫలము అని
బ్రహ్మవైవర్త పురాణం చెపుతుంది. ఈసారి శ్రీకృష్ణ జయంతి గురువారం నాడు ప్రాప్తించింది. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని కదా! జగద్గురు జయంతి గురువారం నాడు ప్రాప్తించుట కోటి కోటి యుగాల సుకృతంగా భావించి ఆచరించాలి.
అష్టమీ కృష్ణపక్షస్య రోహిణీ ఋక్ష సంయుతా |
భవేత్పౌష్ఠ్రపదే మాస జయంతి నామసాస్మృతాం ||
అని విష్ణురహస్యములో చెప్పబడింది. భాద్రపద బహులాష్టమి రోహిణిలో ఉంటే శ్రీకృష్ణజయంతి జరుపుకొనవలయును.
అర్ధరాత్రం తయోర్యోగ: హ్యసంపూర్ణ భవేద్యది |
ముహూర్తమప్యహో రాత్రే యోగశ్చేత్తా ముపాసయేత్ ||
అని వసిష్ఠసంహిత చెపుతోంది. రోహిణీ నక్షత్రం కృష్ణాష్టమినాడు అర్ధరాత్ర సమయమున ఉండుట ముఖ్యము. కృష్ణుడు అవతరించినది అర్ధరాత్రముననే కావున రోహిణి నక్షత్రం కృష్ణాష్టమి నాడు అర్థరాత్ర సమయమున ఉండుట ముఖ్యము. ఒకవేళ అర్ధరాత్రమున లేకున్నా అహోరాత్రమున ఎపుడో ఒక ముహూర్తన ఉన్నా భాద్రపద కృష్ణాష్టమినాడు శ్రీకృష్ణజయంతి జరుపుకొనవలయును.
విష్ణు రహస్యములో కూడా భాద్రపద కృష్ణపక్ష అష్టమీ రోహిణీ నక్షత్రముతో కలిసి ఉన్నపుడే శ్రీకృష్ణ జయంతి జరుపుకొనవలయును అని చెప్పబడింది. అర్ధరాత్రమున రోహిణీ, అష్టమీ, గురువారం మూడూ కలిసి ఉంటే ఆ సమయమున స్నానం చేసి శ్రీకృష్ణ పూజ చేసుకొనవలయును అని విష్ణుధర్మమున చెప్పబడింది. రాత్రిపూట రోహిణీ యోగముంటేనే జయంతి సమారోహమును జరుపుకొనవలెనని కొందరి ఉవాచ. కాని అది అంతగా ఆచరణయోగ్యము కాదని చాలా పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ జయంతిని జరుపుకొనువారి ఇంటిలో లక్ష్మి స్థిరంగా ఉంటు-ంది అని గరుడపురాణ వచనము. తాము చేయలేకున్నా ఇతరులతో చేయించినా అంతే ఫలం కలుగుతుంది. అసలు ఫలం శ్రీకృష్ణ అనుగ్రహము కదా! అది ఉంటే అన్నీ లభిస్తాయి.
ఈ జయంతి వ్రతము నిత్యము, కామ్యము అని రెండు విధములు. సర్వకార్య విజయము కొరకు, సర్వాభీష్టసిద్ధికి చేసేది కామ్య జయంతి వ్రతము. ముక్తి కొరకు చేయు వ్రతము నిత్య జయంతి వ్రతము. నిత్య జయంతి వ్రతము కూడా రెండు విధములు. నక్షత్ర జయంతి, ప్రతిదిన జయంతి. ప్రతిదినము శ్రీకృష్ణ అభిషేకము ఆరాధన వెన్న, క్షీరాన్నముతో నివేదన చేయుట నిత్య జయంతి వ్రతము.
ఇక ప్రతి రోహిణీ నక్షత్రమునాడు శ్రీకృష్ణునికి శక్తికొలది ద్రవ్యములతో అభిషేకము, ఆరాధన, నివేదన, హారతి జరుపుట చాలా విశేషము. ఇలా శ్రీకృష్ణాష్టమిని, శ్రీకృష్ణ జయంతిని జరుపుకోండి.
ధర్మమర్థం చ కామం చ మోక్షం చ మునిపుంగవ |
దదాతివాంభితాన్ అర్థాన్ యే చాన్యే ప్రతిదుర్లభా: ||
అను స్కాంధ వచనము. అంటే శ్రీవిష్ణు జయంతి ఉత్సవమును జరుపుకొనువారికి అఖిల ఫలితములు లభించునని విష్ణు ఉవాచ. అనగా ఒక్క శ్రీకృష్ణ జయంతియే కాదు, వామన జయంతి, నృసింహ జయంతి, పరశురామ జయంతి, మత్స్య జయంతి, కూర్మ జయంతి, వరాహ జయంతి అదేవిధంగా కపిల జయంతి, వ్యాస వాల్మీకి, అగస్త్య, వసిష్ఠ, భరద్వాజ ఇట్లు- పరమాత్మ అవతారములను, పరమర్షులను ఆరాధించి, సంస్కారాన్ని, సౌందర్యాన్ని, సంపదలను, సౌహార్దాన్ని, సామాజిక సుఖశాంతులను పొందాలని ఆశిద్దాం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి