Friday, November 22, 2024

రాజ్యకాంక్ష కన్నా ధర్మదీక్ష మిన్న!

అధికారం కోసం, ఐశ్వర్యంకోసం, ప్రాకులాడుతూ, వాటిని పొందటానికి ఎంతటి అకృత్యాలకు, అధర్మాలకు పాలుపడటానికైనా, తెగబడే స్వార్థ పరులు ప్రబలిన ఈ కాలంలో, చేతికందిన రాజ్య సంపదలను ధర్మాచ రణ కోసం తృణప్రాయంగా పరిత్యజించిన కొందరు మహనీయులు, త్యాగ ధనుల గురించి తెలుసుకోవడం, వారిని స్మరించుకోవడం ఎంతో స్ఫూర్తిదా యకంగా ఉంటుంది. వారి ధర్మాచరణ మనకు ఆశ్చర్యం కలిగించడమే కాదు మార్గదర్శనం కూడా చేస్తుంది.
శ్రీరామ, భరతులు తెల్లవారితే శ్రీరాములవారి రాజ్య పట్టాభిషేకం. అనూహ్యంగా దశరథ మహారాజు, తానొకనాడు తన ముద్దులరాణి కైకేయికి ఇచ్చిన వరాల ప్రకారం, అవి తాను తీర్చవలసి ఉన్నందున, శ్రీరాముని పిలిచి, అతనిని పదునాలు గేండ్లు వనవాసానికి వెళ్ళమనీ, రాజ్యాన్ని తమ్ముడు భరతునికి కట్టబెట్టమనీ ఆదేశించగా, శ్రీరాముడు కొంచెం కూడా చలించకుండా, సంతోషంగా వనవా సానికి వెళ్ళిపోయాడు.
” స పితుర్వచనం శ్రీమానభిషేకాత్‌ పరంప్రియం
మనసా పూర్వ మాసాద్య వాచా ప్రతి గృహతవాన్‌”
పట్టాభిషేకం కంటే ప్రియమైన పితృవచనాన్ని మన:పూర్వకంగా అంగీ కరించి, తనను అనుసరించి వచ్చిన భార్యతో, సోదరుడు లక్ష్మణునితో కలిసి రాముడు అడవులకు వెళ్ళాడు.
ఏమాత్రం కష్టపడకుండానే, తనతల్లి సులభంగా తనకు సాధించి ఇచ్చిన రాజ్యసంపదను చూచి ఆనందించ వలసిన భరతుడు, ధర్మబద్ధుడు కనుక, తన అన్న రాముడు అనుభవించాల్సిన రాజ్యాన్ని తాను అనుభవించడానికి అంగీకరించలేదు. అన్న ఉన్న అడవికి ససైన్యంగా వెళ్ళి, అతని పాదాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ, రాముని అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించవలసిందిగా కోరుతూ, అతనికి మారుగా తాను వనవాసం చేస్తాననీ, అంగీకరించమని భరతుడు బ్రతిమిలాడుతాడు. తాను తండ్రికి ఇచ్చిన మాట మీరనని, పదునాలుగేండ్లు గడిచేవరకూ అయోధ్యకు రాననీ తన దృఢ నిర్ణ యాన్ని ప్రకటించిన రాముని వేడుకొని, అతని పాదుకలు తీసుకొని, వాటిని సింహాసనంపై ప్రతిష్ఠించి, శ్రీరాముని ప్రతినిధిగా నందిగ్రామం నుండి రాజ్య కార్యాలను భరతుడు, శ్రీరాముడు వనవాసం ముగించి తిరిగి అయోధ్యకు వచ్చేవరకూ, నిర్వ#హస్తాడు. ఎంతో పితృభక్తి, సోదర భక్తి కలిగిన శ్రీరామ, భరతులకు రాజ్య సంపదలు గడ్డిపరకతో సమానం.
ఖాండిక్య కేశిధ్వజులు
నిమి వంశజులైన ఖాండిక్య కేశిధ్వజులిద్దరూ దాయాదులు. అకుంఠిత విష్ణు భక్తులు. ఖాండిక్యుడు మహాజ్ఞాని. కాగా కేశిధ్వజుడు కర్మఠుడు, అంటే నిత్యం వైదిక కర్మలు చేయటంలో ఆసక్తి, నిష్ఠ కలవాడు. క్షత్రియ ధర్మంగా రాజ్యంకోసం పరస్పరం విజిగీషులై ఘోరయుద్ధం చేస్తారు. ఆ అన్నదమ్ముల యుద్ధంలో కేశిధ్వజుడు విజయుడై, వీరభోజ్యంగా రాజ్యాధికారం పొంది సింహాసనం అధిష్టిస్తాడు. స్వతహాగా జ్ఞాని అయిన ఖాండిక్యుడు విరాగియై అడవులలో తపోవృత్తిలో జీవితం గడుపుతూ ఉంటాడు. కొన్నేళ్ళ తర్వాత, కర్మఠుడైన కేశిధ్వజుడు గొప్ప యజ్ఞాన్ని సంకల్పించి, యజ్ఞదీక్షలో ఉండగా అతని యాగధేనువును పులి కబళిస్తుంది. యజ్ఞ భంగం కలుగకుండా ప్రాయ శ్చిత్తం చేసుకోవాలనుకొన్న కేశిధ్వజునికి ఋత్వికులు (యాగం జరిపించే బ్రాహ్మణులు), మ#హర్షులు ఆ ప్రాయశ్చిత్త విధి విధానము తెలిసినవాడు ఖాం డిక్యుడు ఒకడేనని చెబుతారు. అడవిలో ఉన్న అతని దగ్గరకు వెడితే కేశిధ్వజుని సులభంగా ఖాండిక్యుడు వధించి రాజ్యాన్ని కైవసం చేసుకోగలడని మంత్రులు కేశిధ్వజుని హెచ్చరిస్తారు. అప్పుడతడు ”ప్రాయశ్చిత్త విధానం తెలుసుకోడా నికి వెళ్ళినప్పుడు ఖాండిక్యుడు నన్ను చంపాడా నాకు యజ్ఞఫలం లభిస్తుంది. ఒకవేళ ప్రాయశ్చిత్త మార్గం సూచించాడా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి అయ్యి నా కోరిక సిద్ధిస్తుంది. ఎలా అయినా మంచిదే కదా అని బదులిచ్చి ఖాండిక్యుని వద్దకు వెళ్తాడు. అతని రాక తెలిసి ఖాండిక్యుని హితాన్ని కోరుకొనేవారు శత్రు శేషం లేకుండా చేసుకోవడానికిగాను, ఖాండిక్యుని చంపడానికే కేశిధ్వజుడు వస్తున్నాడని అపార్థం చేసుకొని అతనిని ఎదుర్కోవడానికి సిద్ధమౌతారు. వారందరికీ కేశిధ్వజుడు తన రాకకు గల కారణం వివరించి ఖాండిక్యుని వద్ద కు తనను తీసుకొని పొమ్మని వేడుకొంటాడు. వారిలో కొందరు వేగంగా ఖాండి క్యుని వద్దకు వెళ్ళి కేశిధ్వజుడు మీ దగ్గరకు రాగానే అతడిని మట్టుబెట్టి సుల భంగా రాజ్యాన్ని పొందమని సలహా ఇస్తారు.
అప్పుడు ఖాండిక్యుడు వారితో ”ఆవిధంగా చేస్తే నాకు తాత్కాలికమైన రాజ్యభోగము, కేశిధ్వజునకు శాశ్వత పరలోకము ప్రాప్తిస్తాయి. అశాశ్వతమైన రాజ్య సుఖాల కోసం, ధర్మవిరుద్ధమైన పాపానికి పాల్పడి ఉత్తమ పరలోక సౌఖ్యాలకు దూరం కావడం నాకు ఇష్టంలేదు. బద్ధాంజలియై చెంతకు వచ్చిన వానిని చంపడము నరక హితువు” అని చెప్పి, కేశిధ్వజునికి ప్రాయశ్చిత్త మార్గా న్ని సూచించి, అతడు తన యజ్ఞాన్ని పరిసమాప్తి చేయడానికి తోడ్పడతాడు. యాగం పూర్తి అయ్యాక కేశిధ్వజుడు తిరిగి ఖాండిక్యుని దర్శించుకొని గురు దక్షిణగా ఏదైనా కోరుకొమ్మని ప్రార్థిస్తాడు. అప్పుడు ఖాండిక్యుని హితాభి లాషులు, పరివారము తనకు సామ్రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని కోరమని సలహా ఇస్తారు. ఖాండిక్యుడు నవ్వి చంచలమైన రాజ్యలక్ష్మి తనకు అవసరం లేదంటా డు. ఆయన కేశిధ్వజునికి తెలిసిన ఆధ్యాత్మవిద్యను తనకు ఉపదేశించమని కోరి, అదియే తనకు గురు దక్షిణ అంటాడు. అలా కేశిధ్వజుని వద్ద ఆధ్యాత్మిక విద్యను ఖాండిక్యుడు ఉపదేశరూపంలో పొందుతాడు. దీనితోబాటు అర్ధరా జ్యాన్ని కూడా ఇస్తానని కేశిధ్వజుడు ఎంత చెప్పినా కూడా ఖాండిక్యుడు ”రా జ్యము వీరభోజ్యము. యుద్ధంలో ఓడిన నాకు రాజ్యం స్వీకరించడం ధర్మం కాదు” అని తిరస్కరించి తపోవృత్తిలోనే జీవితం చరితార్థం చేసుకొంటాడు. ఆయన ధర్మనిరతికి ఆశ్చర్యపోయిన కేశిధ్వజుడు తన కొడుకుతో బాటు ఖాండిక్యుని కుమారునికి కూడా యువరాజ పట్టాభిషేకం చేస్తాడు.

శివాజీ, సమర్థ రామదాసులు
ఆనాటి తన కుటుంబ స్థితిగతులు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తన ‘స్వరాజ్య సంస్థాపనాకాంక్ష’ సాధ్య పడదేమోనని కలవరపడుతున్న శివాజీ లో ఆత్మస్థైర్యాన్ని నింపి, కనీసం తనకోసమైనా రాజ్యాన్ని స్థాపించమని ఆదేశి స్తాడు సమర్థరామదాసు. ఆయన ప్రబోధంతో శివాజీ రెట్టించిన ఉత్సాహంతో ధర్మవినాశకులతో యుద్ధాలు చేసి తన గురువు సమర్థరామదాసు ఆశయాన్ని నెరవేరుస్తాడు. ధర్మ దీక్షముందు రాజ్యకాంక్షను తృణప్రాయంగా భావించిన అలాంటి ఆదర్శమూర్తులు మార్గదర్శ కులుకావాలి. ఆ మహనీయులు మనకు ప్రేరణ నివ్వాలని ఆశిద్దాము.

  • డా.గొల్లాపిన్ని సీ తారామశాస్త్రి 9440781236
Advertisement

తాజా వార్తలు

Advertisement