Thursday, November 21, 2024

ధర్మ నిరతి

సత్యం శాశ్వతమైనది. కాల మా న కారకాలకు, స్థితిగతులకు, పరి స్థితులకు అనుగుణంగా సత్యం మార్పు చెందదు. ధర్మం మాత్రం కాలా నుగుణంగా, పరిస్థితుల ఆధారంగా, జరి గిన లేక జరుగుతున్న ఘటనలు సంఘట నల ప్రాతి పదికన, చిన్నచిన్న మార్పుల కు లోను కావొచ్చు. యుగాల రీత్యా ధర్మంలో కొన్ని మార్పులు చోటు చేసు కుంటాయి. అందుకే ”యుగధర్మం ” అని అంటారు.
అంత మాత్రాన ధర్మం మూల స్వ రూపం సమగ్రంగా, సంపూర్ణంగా మారి నట్లు భావించవలసిన అవసరం లేదు.
వ్యక్తి ధర్మం వృత్తి ధర్మానికి విరుద్ధం గా ఉండవచ్చు. వృత్తి ధర్మం వ్యక్తి ధర్మా నికి ఆటంకమవవచ్చు. ఆందోళన కలిగించవచ్చు. ధర్మం వ్యక్తిపరంగా, వృత్తి పరంగా, వ్యవస్థ పరంగా, మత పరంగా, బాంధవ్యాల పరంగా, సంబంధాల పరంగా, బంధనాల పరంగా, ఒక్కో స్థితిలో ఒక్కోలా, వేర్వే రు పరిస్థితులలో వేర్వేరుగా ఉన్నట్లు అనిపించవచ్చు. వేర్వేరుగా ఉండ నూ ఉండవచ్చు. కాబట్టి ధర్మ నిర్ణయం చేసే సందర్భంలో మనం ఎన్నిం టినో పరిగణించాలి. పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక ఆసామి ఒకరికి భర్త. మరొకరికి కొడుకు. వేరొకరికి తండ్రి. కాబట్టి ఆ ఆసామి ఒకరి దగ్గర భర్తగా ధర్మం ఆచరించాలి. మరొకరి దగ్గర కొడు కుగా ధర్మం నెరవేర్చాలి. ఈ రెండు ధర్మాలను నిర్వర్తించే సమయంలో ఒక్కోసారి సంకట పరిస్థితులు ఎదురుకావచ్చు. ఒక ధర్మానికి మరొక ధర్మం విరుద్ధంగా ఉండి, ఏంచేయాలో పాలుపోక అంతర్మధనానికి గురి కావొచ్చు. ”ధర్మ సంకటం” కలగవచ్చు. దీనినే ”ఎథికల్‌ డైలమ్మా” అని ఆంగ్లంలో అంటారు.
ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషనేవాడు విజ్ఞతతో మెలగగల గాలి. విచక్షణతో విషయాన్ని తూచగలగాలి. వివిధ ధర్మాలను సమన్వ యం చేసుకుంటూ, ధర్మ సమన్వయంతో ఒడుపుగా ధర్మాన్ని ఆచరించా లి. ధర్మాన్ని నిలపాలి. ధర్మవంతులుగా నిలబడగలగాలి.
న్యాయమూర్తి ఉంటాడు. తానిచ్చే తీర్పుతో ఓ వ్యక్తి దండనకు గురి అవవచ్చు. అయితే ఏ ఒక్కరికీ యితరుల్ని బాధించే, బాధకు గురిచేసే ఏ పనినీ ఏ వ్యక్తీ చేయకూడదని వ్యక్తి ధర్మం చెబుతుంది. అలాగే తప్పు చేసిన వానిని శిక్షకు గురిచేసి ధర్మాన్ని నిలబెట్టాలని అతని వృత్తి ధర్మం చెబు తుంది. అప్పుడు ఆ న్యాయమూర్తి ఓ వ్యక్తిగా ఘర్షణకు గురౌతాడు. సంఘ ర్షణకు లోనవుతాడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందాన ఆయ న స్థితి ఉంటుంది. అలాంటి ఆందోళ నకర పరిస్థితిలో ఆ న్యాయమూర్తి మనోవేదనకు గురికాక తప్పదు. అప్పుడు ఆ న్యాయమూర్తి ఏం చేయాలి? ఏది అవసరమో, ఏది అవశ్యమో, ఏది ఉత్తమ ధర్మమో దానిని నిర్వర్తిం చాలి. ఆచరించాలి. దానినే ధర్మనిరతి అంటారు. అదే ధర్మ రక్షణ. ధర్మ పరిరక్షణ.
ధర్మ నిరతికి సంబంధించి మహాభారతంలో అరణ్య పర్వంలో ఓ దృష్టాంతం కనిపిస్తుంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. ఓ రోజు పాండవులు అరణ్య మార్గం వెంట వెళ్తున్నారు. ధర్మరాజుకు విపరీతమైన దాహం వేసింది. తాగేందుకు మంచినీళ్ళు ఎవరి దగ్గరా లేవు. ధర్మరాజుకు దాహం ఎక్కువవు తోంది.
ధర్మరాజు అర్జునుడిని పిలిచి ”అర్జునా! ఇక్కడెక్కడైనా దగ్గరలో కొలను ఉంటుంది. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకొని రా.” అని అర్జునునికి చెప్పాడు. అర్జు నుడు మంచి నీరు తెచ్చేందుకు వెళ్ళాడు. సమయం గడిచిపోతోంది గానీ అర్జునుడు రాలేదు. ధర్మజుడు భీముడ్ని ఏం జరిగిందో చూసి రమ్మ నమని పంపాడు. అర్జునుని కోసం వెళ్లిన భీము డు కూడా ఎంతసేపైనా రాలేదు. ధర్మరాజు ఏదో ఆపదను శంకించాడు. వెళ్లి చూడమని నకులుడ్ని పంపాడు. నకులుడు కూడా ఎంతసేపైనా రాలేదు. ఏమై ఉంటుందో అనే ఆందోళన ధర్మరాజులో ఎక్కువైంది. సహ దేవుడ్ని పిలిచి ”అన్నలు ఏదో ఆపదలో చిక్కుకున్నట్టుంది. మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఏ అపాయం కలిగిందో ఏమో, నువ్వు త్వర గా వెళ్ళి చూసిరా.” అని సహదేవుడ్ని పంపాడు. వెళ్ళిన సహదేవుడు కూడా వెనుకకు రాలేదు. ధర్మరాజుకి ఆందోళన బాగా ఎక్కువైంది. చేసే దేమీ లేక తమ్ముళ్లు వెళ్ళిన వైపుకి ధర్మరాజు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక ఓ కొలను కంటపడింది. కొలనుకి ముందుండే స్థలంలో నలుగురు తమ్ముళ్లు నేలపై పడి ఉన్నారు. మూర్చపోయారేమో అనుకుని, నీళ్ళు తెచ్చి తమ్ముళ్ల ముఖాల మీద కొట్టాలనుకుని, కొలనులోకి దిగి నీళ్ళలో చేతుల్ని ముంచబోతున్నాడు ధర్మరాజు. ”ఆగు. ఆ నీరు త్రాగకు. నీ తమ్ము ళ్ళు నా మాట వినలేదు. నీరు త్రాగ వద్దని ఎంత చెప్పినా త్రాగారు. నువ్వూ వాళ్ళలాగే మొండిగా నీటిని తాగేవో, వాళ్ళకు పట్టిన గతే నీకూ పడు తుంది. కాబట్టి నువ్వు నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.” అని అశరీరవాణి పలికింది. ధర్మరాజు అశరీరవాణి అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పాడు. సంతోషించిన యక్షుడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు.
”ధర్మరాజా! నా ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పి, నువ్వు నన్ను మెప్పించావు. నీకో వరాన్ని యిస్తాను. విగత జీవులైన నీ నలుగురు తమ్ము ళ్లలో ఒకరిని బ్రతికించుకునే వరాన్ని నీకు యిస్తున్నాను. ఎవరిని బ్రతికిం చాలో కోరుకో. బ్రతికిస్తాను.” అని యక్షుడు చెప్పాడు. ధర్మరాజు ఏమా త్రం ఆలస్యం చేయకుండా, ఏ ఆలోచనా చేయకుండా ”మహానుభావా! మహా సంతోషం. నా తమ్ముడు నకులుడిని బ్రతికించు.” అని ధర్మరాజు కోరుకున్నాడు.
యక్షుడు ఖంగుతిన్నాడు. ”ఏమి ధర్మజా! నువ్వు చాలా అమాయ కంగా కనిపిస్తున్నావు . అర్జునుడు విలువిద్యలో ఆరితేరినవాడు. సవ్య సాచి. భీముడు మహాయోధుడు. మహా బలశాలి. వీరిద్దరిలో ఎవరో ఒక రిని కోరుకో. వాళ్ళిద్దరిలో ఒకరిని బ్రతికిస్తాను.” అని అన్నాడు యక్షుడు.
అప్పుడు ధర్మరాజు యిలా సమాధానం చెబుతాడు. ”మహానుభా వా! మా తండ్రిగారికి యిరువురు భార్యలు. అంటే మా అయిదురుకి ఇద్ద రు తల్లులు. మా తల్లి కుంతీదేవికి ముగ్గురం. వాళ్ళలో పెద్దవాడిని అయిన నేను బ్రతికి ఉన్నాను. మా పిన తల్లి మాద్రికి నకులుడు, సహదేవుడు యిద్ద రు. కాబట్టి మాద్రీమాత సంతానంలో పెద్దవాడైన నకులుడు బ్రతికి ఉం డుటే ధర్మం. కాబట్టి నకులుని బ్రతికించమని కోరుకున్నాను. ఇదియే ధర్మం.” వినయంగా చెప్పాడు ధర్మరాజు. ధర్మరాజు ధర్మ నిరతిని విన్న యక్షునికి ముచ్చటయ్యింది. ”ధర్మజా! నీ ధర్మ నిరతిని పరీక్ష చేయడానికే నీకీ పరీక్ష పెట్టదలచాను.
ఈ నాటకం ఆడాను. పరీక్షలో నువ్వు గెలిచావు. నీ ధర్మమే నీకు శ్రీ రామరక్ష. నీ తమ్ముళ్ళు నలుగురూ బ్రతుకుతారు.” అని యక్షుడు చెప్పినంతనే నలుగురు తమ్ముళ్లు లేచి కూర్చున్నారు.
”ధర్మో రక్షతి రక్షిత:”. మనం ధర్మాన్ని రక్షిస్తే, ధర్మమే మనల్ని రక్షి స్తుంది. ధర్మానువర్తనులుగా మారాలి. కర్మ మూర్తులుగా, ధర్మమూర్తు లుగా, దివ్యమూర్తులుగా, దివ్యత్వ మూర్తులుగా నిలుద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement