Monday, November 25, 2024

ధర్మం – మర్మం : రథసప్తమి విశిష్టత (ఆడియోతో…)

రథ సప్తమి ప్రాశస్త్యం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మాఘ శుక్ల సప్తమిని ‘మహాసప్తమి’ మరియు ‘రథసప్తమి’గా వ్యవహరిస్తారు. సప్తమి అనగా ఏడింటి సముదాయము. అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి ఈ ఏడింటిని సప్తమి అని అందురు.

||ఇంద్రియాణి హయాన్యాహు: మన: ప్రగ్ర హ ఏవచ ||

అనగా ఉపనిషత్తులలో ఇంద్రియములను అశ్వములుగా చెప్పియున్నారు. ఈ ఏడు ఇంద్రియములే సూర్యుని ఏడు గుఱ్ఱములు. మన శరీరమే సూర్యరథము దానికి సారథి అనూరువు. ఇతనే అంత: కర ణము లేదా బుద్ధి. వేదాంత శాస్త్రమున వక్షస్థలమును భక్తిగా, నడుము వైరాగ్యముగా, పిరుదులను జ్ఞానముగా, ఊరువులను జ్ఞానమునకు ఆధారమైన విషయములుగా చెప్పెదరు. ఊరువులు లేని వాడు అంటే విషయ వ్యామోహము లేనివాడు అని అర్థము. విషయములను మనస్సు, బుద్ధి కోరతాయి కాని అంత: కరణము కోరదు. అందుకే అంత: కరణం అనూరువు. ఇలా సూర్యభగవానుని స్వరూపములో మన శరీరము, మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అంత:కరణము ఉన్నవని తెలుసుకొని వాటిని పరమాత్మకు అర్పించాలి. అనగా పరమాత్మ ప్రపంచాన్ని అందించినది, ప్రపంచము ద్వారా తనను ఆరాధించమని సూచించడానికే. ఈ ప్రపంచములోని విషయములు సృష్టించినది తన మీద భక్తిని , ప్రపంచం మీద విర క్తిని పెంచుటకు. భగవంతున్ని అర్చించడానికి ఉపయోగించే సంసారం మహాసారం కానీ శరీరాన్ని అనుభవించడానికి ఉపయోగించే సంసారం ‘సం’సారమని మనకు చెప్పేవాడు సూర్యభగవానుడు. స ప్తాశ్వములు కలవాడు, అందులో మాఘ శుక్ల సప్తమి మహాస ప్తమి కావున ఆయనను ఆనాడే ఆరాధిస్తాము.

భవిష్య పురాణానుసారం…

- Advertisement -

మాఘస్య శుక్లపక్షేతు పంచమ్యాం మత్‌ కులోద్వహ
ఏక భక్తం సదాఖ్యాతమ్‌ షష్ట్యామ్‌ నక్తముదాహృతమ్‌
సప్తమ్యాం ఉపవాసంతు కేచిదిచ్ఛంతి సువ్రత
షష్ట్యాం కేచిద్వ దంతీహ సప్తమ్యాం పారణం కిల
కృతోపవాస: షష్ట్యాంతు పూజయేత్‌ భాస్కరమ్‌ బుధ:

మాఘశుక్ల సప్తమిని ఆచరించేవారు పంచమినాడు పగలు మాత్రమే భుజించి, షష్టి నాడు నక్తమును ఆచరించి సప్తమి నాడు పూర్తిగా ఉపవసించి అష్టమి నాడు ఉదయం పారణ చేయాలి. కొందరు షష్టి నాడు ఉపవసించి సప్తమి నాడు పారణ చెెసెదరు.

మహాసప్తమి లేదా రథసప్తమి నాడు ఉపవసించి ఎర్రని చందనముతో కలసిన కరవీర (గన్నేరు) పుష్పములతో సూర్యుభగవానుని పూజించవలయును. గుగ్గులు, సాంబ్రాణి ధూపం వేయవలయును. ఇట్లు కార్తిక శుద్ధ సప్తమి నుండి మాఘ శుద్ధ సప్తమి వరకు నాలుగు మాసములు ప్రతి శుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుని ఆరాధించవ లయును. ఇది గృహస్థులు ఆచరించు మరొక చాతుర్మాస్య వ్రతం. మరి కొందరు మాఘ శుద్ధ స ప్తమి నుండి వైశాఖ శుద్ధ సప్తమి వరకు నాలుగు నెలల్లో ప్రతిశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానున్ని ఆరాధింతురు.

మహా సప్తమి నాడు బ్రాహ్మీ ముహూర్తమున నిద్ర లేచి శరీరమునకు ఆవు పేడ పూసుకొని అవకాశముననుసరించి పుణ్య నదులలో లేదా బావి వద్ద స్నానమాచరించి సంధ్యా వంద నాదులు ముగించుకొని పైన చెప్పిన రీతిలో సూర్య భగవానుని ఆరాధించవలెను. మన: శుద్ధి కొరకు పెసర గింజంత ఆవుపేడను భుజించవలెను. వ్రతము ముగిసిన పిదప రథ సప్తమి నాడు సూర్యభగ వానున్ని అర్చించి వేదవేదాంగ విధులైన బ్రాహ్మణులను భుజింపచేసి శక్తి ఉంటే మూడు మాసముల ఎత్తు బంగారంతో రథము చేసి దానము చేయవలెను.

భవిష్యపురాణానుసారం ||దానం స్వర్ణ రథస్యేహ యధోక్తం విభవే సతి ||

శక్తి లేని వారు వెండి, రాగి, ఇత్తడి లేదా చెక్కతో ఆ శక్తి కూడా లేనివారు వస్త్రము, పిండి, మైనంతో రథమును చేసి దక్షిణ తాంబూల, వస్త్రములతో రథమును సూర్యభగవానుని ప్రీతికై దానము చేయవలెను.

భక్తిశ్రద్ధలు కలవారు రథసప్తమి నాడు సూర్యభగవానుని రథముపై కూర్చుండబెట్టి రథయాత్ర చేసెదెరు. మహాస ప్తమి మహాపుణ్యప్రదం కావున రథ సప్తమి నాడు పైన చెప్పిన విధంగా ఉపవసించి సూర్యభగవానున్ని ఆరాధించి శక్తి కొలది వస్త్ర, సువర్ణ రథములను దానం చేసి బ్రాహ్మణులను భుజింప చేసినచో ధనమును, సంతానమును, కీర్తిని, విద్యను, సంపదను ఇతర అభీష్టములను పొందెదరు.

ముఖ్యంగా సూర్యభగవానుడు బుద్ధిప్రదుడు, సకల విద్యాప్రదుడు కావున రథ సప్తమి నాడు విద్యార్థులు శ్రద్ధా భక్తులతో సూర్యభగవానున్ని ఆరాధించిన ఉత్తమ విద్యాబుద్ధులను పొందెదరు. విద్యార్థులకు ఇది మహా పర్వదినం కావున విద్యార్థులందరూ విద్యాదేవతైన సూర్యభగవానున్ని ఆరాధించి విద్య, మంచి బుద్ధులు పొంది సమాజ సంక్షేమం, దేహసంక్షేమం, లోక సంక్షేమాన్ని కలిగించడంలో తమ వంతు పాత్రను పోషించాలి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement