Thursday, October 24, 2024

ఔదార్యము గూర్చి శ్రీమాన్‌ డా॥ కందాడై రామానుజాచార్యులవారి వివరణ

ఇక వరాహావతారంలో స్వామి ఔదార్యాన్ని తెలుసుకుందాము. ఒకటి అడిగితే అడిగినదానిలో కొంత ఇచ్చేవారు కొందరు. అడిగినది మొత్తం ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉంటారు. కాని ఒకటి అడిగితే అడిగినదానినే కాక పైన మరో నాలుగు కూడా ఈయటం నిజమైన ఔదార్యము. ఈ ఔదార్యం ఒక పరమాత్మలోనే ఉన్నది. మత్స్యావతారంలో బ్రహ్మ అడిగినది వేదాలనైతే వేదాలను ఇచ్చాడు. ఆ వేదాల సారమును సమగ్రంగా ఋషులకు, ఋషులద్వారా బ్రహ్మకు బోధించాడు. భవిష్యత్తులో మనువును పడవలో కూర్చోబెట్టి ప్రళయకాలమంతా రక్షించాడు. ఇలా ఒకటి అడిగితే నాలుగు, అంతకన్నా ఎక్కువే ఇచ్చినది మత్స్యావతారం. ఇక కూర్మావతారం అమృతం అడిగితే అమృతాన్నీయటం జరిగింది. తాను పురుషోత్తమత్వాన్ని కూడా కాదని జగన్మోహిని అయ్యాడు. మందరపర్వతాన్ని మోశాడు. లక్ష్మీదేవిని ఆవిర్భవింపచేసి లక్ష్మీకటాక్షాన్ని కలిగించాడు. అన్నీ తానై సముద్రాన్ని చిలికాడు. శంకరునికి నీలకంఠత్వాన్ని ప్రసాదించాడు. ఇంద్రునికి త్రైలోక్య రాజ్యాన్ని ఇచ్చాడు.
ఇక వరాహావతారం వాస్తవంగా నీటిలో మునిగిన భూమిని నీటిపైకి తెస్తే ప్రాణులు నివసిస్తాయి. లేకుంటే జీవులకు ఆవాసమేది అని మనువు బ్రహ్మనడిగితే ఆ బ్రహ్మ స్వామిని ప్రార్థించాడు. స్వామి వెంటనే వరాహరూపం ధరించి భూమిని పైకి తీసుకొచ్చాడు. నీటిపై ఆపాడు. ఆ భూమికి ఆపద కలిగించటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సంహరించి భూమికి ముందు ముందు ఆపదలు కలుగకుండా చేశాడు. అదే సమయంలో తన గిట్టలలో చిక్కుకున్న మట్టిని, కింద రాలిపడిన రోమములపై మూడు ముద్దలుగా చేసి పితరులకు పిండప్రదానము ఇలా చేయాలి అని పితృయజ్ఞమును వర్తింపచేశాడు. తన జిహ్వను అగ్నిజ్వాలగా, నాసికా రంధ్రములు స్రుక్‌ స్రువములుగా, రోమములు దర్భలుగా, నాలుగు పాదములు నాలుగు వేదములుగా, నేత్రములను ఋత్విక్కులుగా దైవయజ్ఞమును ప్రవర్తింపచేశాడు. వరాహ రూపంలోనే భూదేవికి, ఋషులకు, ఋగ్యజుస్సామవేదాల్ని బోధించి ఋషి యజ్ఞమును ప్రవర్తింపచేశాడు. ఆ భూమి మీద సముద్రజలముతో తన గిట్టలను గాలితో దున్ని పంట పండిరచి లోకానికి వ్యవసాయాన్ని నేర్పి భూతయజ్ఞం అనగా అఖిల ప్రాణులకు ఆహారాన్నిచ్చాడు. ఋషులు అనే అతిథులకు చక్కని ఆతిథ్యమును ఇచ్చి అతిథి యజ్ఞమును చేశాడు. ఇట్లు ‘భూమిని ఉద్ధరించు స్వామీ!’ అని అడిగితే ఆ ఒక్క పనే కాక ప్రాణులు ఉండటానికి మాత్రమే కాదు భూమి, ప్రాణులు బ్రతకటానికి ఆహారాన్ని భూమి ఇస్తుంది. అతిథులను, అభ్యాగతులను పోషించు సాధనాన్ని భూమి ఇస్తూ, ధర్మంగా ఎలా బ్రతకాలో ధర్మాన్ని భూమే బోధిస్తుంది. ధర్మం తప్పితే భూమి శిక్షిస్తుంది కూడా అని ఇన్ని ఉపకారాలు చేసి చూపి ఈ భూమితో మీరు బ్రతకండి, పదిమందిని బ్రతికించండి అని బోధించి ఆచరించి చూపిన మహోదారుడు వరాహావతారము.

(స‌శేషం)

Advertisement

తాజా వార్తలు

Advertisement