Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : శివ- రాజరాజేశ్వరీ దేవి (ఆడియోతో..)

శివ – రాజరాజేశ్వరీ దేవి అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

ప్రళయకారకుడైన శంకరభగవానుడు చేసే పనులను బట్టి పలు రూపాలు కలవాడిగా చెపుతారు. సూర్యనారాయణుడు ప్రళయకాలంలో శివుని రూపంలో ఉంటాడు. అనగా ఈ శివ సూర్యుడు పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ఊర్థ్వ దిక్కు అనగా మొత్తం ఐదు దిక్కులలో వ్యాపించి ఉంటాడు. తత్పురుష, సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశానా అను ఐదు నామాలు కలవాడు శివుడు. అలాగే చతుష్కళ, అష్టకళ, త్రయోదశ కళ, షోడశ కళ, పంచకళ అను ఐదు శివుని ముఖములు హరిత, రక్త, ధూమ్ర, నీల, పీత వర్ణములలో ఉండును. అభయ, టంక, శూల, వజ్ర, పాశ, ఖడ్గ, అంకుశ, ఘంట, నాగ, అగ్ని అను పది ఆయుధములు పది హస్తములలో ధరించి ఉండును. వాస్తవానికి ఈ పది ఆయుధములు పదిరకాల శక్తులను సూచిస్తూ ఉంటాయి. ఈ శివుని వైభ వం చెప్తూ సర్వజ్ఞుడని, త్రినేత్రుడని అనాది జ్ఞాన స్వరూపుడిగా స్వతంత్రుడిగా అలుప్త, అనంత శక్తి అని సూర్యభగవానుని శక్తులను ఇచట ప్రస్తావించెదరు. సూర్యుడే ప్రళయకాలంలోని శివుడు కావున ఈ పంచవక్త్ర శివుని శక్తినే షోడశి అంటారు. సూర్యకళే సావిత్రి, గాయత్రి కావున త్రిపుర సుందరిగా చెప్పుకున్న భూ:, భువ:, సువ: అను ఈ మూడు పురములే ‘బ్రహ్మపురుములు’ మరియు ‘మహాశక్తిపురములు’. ఈ మూడు పురములు మూడు శక్తులు, మూడు స్వరూపములతో ప్రకాశించే వారినే ‘రాజరాజు’ అని అంటారు. రంజింప చేసేవాడు ‘రాజు’ . నక్షత్రాలు, గ్రహాలు ప్రకాశించేవి కావుని అవి రాజులు. దు:ఖంతో కర్మలను నశింపచేసి, పాపాల్ని పోగొట్టి సంతోషాల్ని కలిగించేవి గ్రహాలే. ఈ విధంగా గ్రహాలు, నక్షత్రాలు రాజులైతే సూర్యుడు రాజరాజు. సూర్యుడు ప్రళయ కాలంలో తమోరూప శివుడు కావున శివుడిని రాజ రాజు అని పేర్కొంటారు. శివుని అర్థాంగి పార్వతి కావున ఆమెనే అతని శక్తిగా ‘రాజరాజేశ్వరీ’గా వ్యవహరిస్తారు. ఈమెను శివ- రాజరాజేశ్వరీ, త్రిపుర, సావిత్రీ, గాయత్రీ అను నామాలతో వ్యవహరి స్తూ ఈ విధంగా స్తుతి చేస్తారు.

బాలార్కమండలా భాసాం చతుర్బాహాం త్రిలోచనాం |
పాశాంకుశ శరాన్‌ చాపం ధారయన్తీమ్‌ శివాం భజే ||

రాజరాజేశ్వరీ దేవిని సేవిస్తే వాక్కు, మనస్సు, ప్రాణము మూడు తేజోవంతమవుతాయి.

నైవేద్యం : అన్ని మధుర పదార్థములు

- Advertisement -

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement