పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
24.
ఆజన్మ మాత్రమపి యేన శఠేన కించిత్
చిత్తం విధాయ శుక శాస్త్ర కధా నపీతా
చండాలవచ్చ ఖరవత్ బతతేన నీతమ్
మిధ్యా స్వజన్మ జననీ నిజ దు:ఖ భాజా
పుట్టినప్పటి నుంచి మరణించే లోపల ఒక్కసారైనా మనస్సు పెట్టి శుక శాస్త్రమైన భాగవత కథను వినని వాడు తన బ్రతుకును ఒక జంతువుగా, మూర్ఖునిగా వెళ్లదీసిన వాడగును. తన పుట్టుక కూడా తల్లికి ప్రసవ వేదనను, తనకు పుట్టుక వేదనను కలిగించినదిగా మాత్రమే ఉండును.
భాగవత కథను వినని వాడు శఠుడు అనగా రహస్యంగా ఎదుటి వారికి అప్రియమును చేసిన వాడని అర్థం. ఇంటిలోని యజమాని ధర ్మ మార్గమును, ధర్మ కథా ప్రసంగమును, ధర్మాచరణను చేయకుంటే అతని పిల్లలు కూడా చేయరు. తమ జీవితం తప్ప వేరే ధర్మం ఉందని వారికి తెలీదు కావున వారి పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఇలా పరంపరగా సమాజానికి రహస్యముగా అప్రియము చేసిన వారగుదురు. భాగవతం ధర్మాన్ని, సత్యాన్ని, సమాజ హితాన్ని, సకల లోకముల సుఖ శాంతులను, ఉత్తమ జ్ఞానమును బోధించుచున్నది. దాన్ని చదవని వారు అవన్నీ తాము కోల్పోవడమే కాక సమాజానికి దూరం చేసినవారగుతారు. జీవితంలో ఒక్కసారైనా మనస్సు పెట్టి భాగవతాన్ని విననివారు, చదవని వారు సమాజానికి రహస్యముగా అప్రియమును చేస్తున్నారు అందుకే అలాంటి వారిని జంతువు అన్నారు. జంతువు తన ఆహార నిద్రాదులను మాత్రమే చూసుకొనును. మనిషి కూడా అదే పని చేస్తే తేడా ఏముంటుంది? అందుకే అలాంటి వారి పుట్టుక వారి తల్లికి వేదన కలిగించునది మాత్రమేనని భావం.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి