పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
23.
యశ్చ భాగవతం శాస్త్రం వాచయేత్ అర్థతోనిశమ్
జన్మకోటి కృతం పాపం నశ్యతే నాత్ర సంశయ:
భాగవత శాస్త్రమును అర్థముతో ప్రతి దినము నిరంతరం చెప్పే వారికి కోటి జన్మల పాపం నశించును. ఇందులో సందేహం లేదు. అంటే ఎప్పుడు భాగవతంలోని శ్లోకం చదివి అర్థమును, విశేషార్థమును ప్రతి రోజు నిరంతరం చెప్పుకునే వారికి కోటి జన్మల పాపం నశించును. భాగవత శ్లోకాలు చదివే వాని కంటే దాని అర్థాన్ని చెప్పేవారికి ఎక్కువ పుణ్యము కలుగుతుందని భావం. అనగా శ్లోకం చదివి దాని భావాన్ని అందులో ఉన్న కధా విశేషాలను వివరించుకుంటూ వెళ్తుతన్న వారికి ఆ కధారసం తమకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఆనందాన్ని, అనుభవాన్ని కలుగజేస్తుంది. మనం మంచి పని చేయకున్నా మంచి పని చేసిన వాని గురించి పదిసార్లు తలుచుకుంటే మనకూ మంచి చేయాలనిపిస్తుంది.
శిబి చక్రవర్తి ఒక డేగకు తన శరీరాన్ని కోసి ఇచ్చాడు. కర్ణుడు కవచ కుండలాలు ఇచ్చాడు. యయాతి, హరిశ్చంద్రుడు, నలుడు, తమ రాజ్యాన్ని ఇచ్చారు. రాముడు తండ్రి మాటకు రాజ్యాన్నివదిలి పెట్టాడు. ఎందరో ఋషులు నగరాన్ని, గ్రామ వాసాన్ని, రాజ్య భోగాల్ని వదిలిపెట్టి అడవిలో తపస్సులో ఆనందాన్ని పొందారు. వారు అడవిలో ఉంటూ ఎంతో మంది రాజుల దు:ఖాలను, కష్టాలను తొలగించి ఎందరికో భోగాలను అందించారు. త్యాగం చేసిన వారు పదిమందికి భోగాలను ఇస్తారు. భోగాన్ని పొందే వారు పదిమంది నుండి త్యాగం ఆశిస్తారు. ఇచ్చుటలోనే ఆనందం ఉంది పుచ్చుకొనుటలో కాదు అనేది భాగవత సారం, ఒక విధంగా పురాణ సారం కూడ. అందుకే భాగవతాన్ని అర్థంతో చెప్పేవారికి అన్ని పాపాలు నశిస్తాయి. పాపపు ఆలోచనలు పోతే పాపాలు పోయినట్టే. పుణ్యాత్ముల కథలు చెప్పినా, వినినా పాపపు ఆలోచనలు రావని ఇందులోని అంతరార్థం.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి