Friday, January 24, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -22 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
22
శ్లోకార్థం శ్లోక పాదం వా నిత్యం భాగవతోద్భవం
పఠస్వ స్వముఖే నైవ యదీచ్ఛాసి పరాంగతిమ్‌

ఉత్తమ గతిని అనగా వైకుంఠమును పొందగోరిన వారు ప్రతి దినము భాగవతంలోని ఒక శ్లోకం కానీ, సగం శ్లోకం కానీ, పావు శ్లోకం కానీ నీ నోటి తోటే నీవు చదువుము.

భాగవతంలో పద్దెనిమిదివేల శ్లోకాలు కలవు. ఇవి చదవడానికి మన జీవితం సరిపోతుందా, చదివినా అర్థం తెలియకుంటే ప్రయోజనం ఏమిటి? సామాన్యులకు భాగవతం అందని పండే కదా అని చాలా మందికి సందేహం, భయము కలుగుతాయి. అలాంటి వారి కోసం పరమ దయాళువు అయిన వ్యాస భగవానుడు ఈ పరిష్కారమును చూపించాడు. అర్థమైనా కాకున్నా, అంతా చదవలేకున్నా, ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదవాలి అదీ కుదరకుంటే సగం శ్లోకం లేదా పావు శ్లోకం చదవాలి. ఇలా ప్రతి రోజు క్రమం తప్పక చదవాలి . రోజూ ఒక శ్లోకం చదివితే సంవత్సరానికి 365
శ్లోకాలు, పది సంవత్సరాలకు 3650, 55 ఏళ్లకు 18000 శ్లోకాలు అవుతాయి. అందుకే అర్థమైనా కాకున్నా శ్లోకం చదివినా పరమాత్మ లోకాన్ని పొందవచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు వైద్యుడిచ్చిన మాత్రను అందులో ఏ పదార్ధములున్నాయో తెలియకుండానే ఆ మాత్రను వేసుకొని ఆ జబ్బు నుండి విముక్తి పొందుతారు. అలాగే భాగవతంలోని శ్లోకాలకు అర్థం తెలియకున్నా ఆ శ్లోకాలు చదివితే సంసారమనే జబ్బు నశిస్తుందని అంతరార్థం.

ఇందులోని మరొక రహస్యమేమనగా ఎన్నడూ తినని వాడైనా కొన్ని పదార్ధాలను ఒక్కసారి తింటే రెండోసారి తినాలని, ఒకటి తింటే రెండు తినాలని
కోరిక కలుగుతుంది. అదే విధంగా భాగవతంలో రోజు ఒక శ్లోకం చదువుతూ పోతే ఇంకా రెండు మూడు చదువుదామనే కోరిక కలుగుతుంది. ఇలా చదువుతూ ఉంటే ఉత్త శ్లోకాలే కాకుండా దానికి అర్థం కూడా తెలుసుకోవాలనే ఆలోచన భగవంతుడు కలిగిస్తాడు. ఇలా ఏ రోజు చదివిన శ్లోకానికి ఆ రోజు అర్థం తెలుసుకుంటే ఇంకా ముందేముందో అని అంతా తెలుసుకోవాలనే ఆరాటం పెరుగుతుంది. దాంతో సంసారంతో పోరాటం చేస్తూనే భాగవతాన్ని చదువుతారు, తెలుసుకుంటారు. ఇలా భాగవత పఠనం పరమాత్మ లోకాన్ని ప్రసాదిస్తుందని పరమార్ధం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement