పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
17.
కిం శ్రుతై: ర్బిహుబి: శాస్త్రె: పురాణౖశ్చ భ్రమవహై:
ఏకం భాగవతం శాస్త్రం ముక్తి దానేన గర్జతి
అనేకమైన శాస్త్రములను భ్రమను తొలగించు పురాణాములను వినుట వలన ఏమి లాభము. ఒక భాగవత శాస్త్రము మాత్రమే మొక్షమిస్తానని గర్జించుచున్నది. భాగవత శాస్త్రము, తర్కము, వ్యాకరణము, మీమాంస, జ్యోతిష్యము ఇత్యాది బహు శాస్త్రములు బుద్ధికి క్లేశమును కలిగించును. పదునైన బుద్ధి కలవాడు మాత్రమే అతి కష్టము మీద ఆ శాస్త్రముల అర్థమును తెలుగుసుకొనగలుగును. అందులోను బుద్ధిబలం గలవాడు తన సమ్మతమును సిద్ధాంతముగా నిరూపించును. అతని కన్నా బుద్ధిబలం గలవాడు అతను చెప్పినది తప్పని తన మాటే సత్యమని నిరూపించును. చదివేవారు, వినేవారు దేన్ని నమ్మాలి దేన్ని అంగీకరించాలనే సందేహంతో ఒక నిశ్చయానికి రాలేరు.
ఇక పురాణములు :
కొన్ని పురాణములు శివుడే పర దైవమని ప్రతిపాదించును. మరికొన్ని పురాణములు శ్రీమహావిష్ణువు పరదైవమని నిరూపించును. కొన్ని బ్రహ్మ పరదైవమని మరి కొన్ని శక్తి పరదైవమని కొన్నింటిలో వినాయకుడు పరదైవమని అందులోనే కొన్నింటిలో ప్రకృతే సర్వదా పూజ్యమని ఇలా పలు సిద్ధాంతాలను ప్రతిపాదించుచున్నందున చదివే వాడికి ఇదా అదా అనే భ్రమ కలుగును ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి అన్న సందేహాలు కలుగుతాయి. అందుకే ఈ శాస్త్రములతో, పురాణములతో ప్రయోజనం లేదు. శ్రీమద్భాగవతం శాస్త్రములలో శాస్త్రము, పురాణములలో పురాణము కావున భాగవతమును సేవించిన వారు సందేహాలకు భ్రమలకు తావు లేకుండా ముక్తిని పొందెదరు. భాగవతమే నేను ముక్తిని ఇచ్చెదనని గర్జించుచున్నదని భావము.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి