పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
16.
భాగ్యోదయేన బహుజన్మ సమార్జితే
సత్సంగ మంచ లభతే పురుషో యదా వై
అజ్ఞాన హేతు కృత మోహ మదాంధకార
నాశం విధాయహి త దోదయతే వివేక:
కొన్నివందల, వేల, లక్షల, కోట్ల జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే మానవులకు సజ్జనులతో సంగమం కలుగుతుంది. మానవుడు ప్రయత్నం చేస్తే సజ్జన సంగమం కలుగదు. ఒకసారి సజ్జన సంగమం కలిగితే అనగా ఒక మహానుభావునితో మనం ఒక్క క్షణం కలిసినా అజ్ఞానం వలన కలిగిన మోహము, మదము అనే అంధకారం నశించి వివేకం కలుగుతుంది. ఒకసారి సజ్జన సంగమం కలిగితే కోట్ల జన్మలలో అనుసరిస్తూ వచ్చిన అజ్ఞానం దాని వల్ల కలిగే మోహం ఆ అజ్ఞానం వలన కలిగే మదం ఇవన్నీ నశించి వివేకం కలుగుతుంది. సజ్జనులు మనం అనుకుంటే రారు, కలవాలంటే కలవరు, అదృష్టం ఉంటే వారికి వారే వస్తారు.
తల్లి కడుపున ఉన్న ప్రహ్లాడుడికి నారదుడే వచ్చి ఉపదేశం చేశాడు. అసలు ప్రహ్లాదుడు ప్రయత్నించ గల స్థితిలో లేడు. తపస్సు చేయడానికి బయలుదేరిన ధ్రువునికి నారదుడు తనకు తానుగా వచ్చి మంత్రోపదేశం చేశాడు కానీ ధ్రువుడు ప్రయత్రించ లేదు. అలాగే గంగా తీరంలో ప్రాయోపవేశం చేసిన పరీక్షిత్తు మహారాజు వద్దకు శుక యోగీంద్రుడే వచ్చాడు కాని పరీక్షిత్తు ప్రయత్నించలేదు. అలాగే తత్త్వ జ్ఞానం పొందాలని బయలుదేరిన రహూగణ మహారాజు వద్దకు జడ భరతుడు తనకు తానుగా వచ్చాడు. మన పురాణాలలో ఇలాంటి గాధలు కోకొల్లలు. చాలా జన్మల నుంచి సంపాదించిన పుణ్యం ఉంటేనే సజ్జనుల దర్శనం లభిస్తుంది. ఆ దర్శనం మన అజ్ఞానాన్ని, అజ్ఞానం వలన కలిగే మోహాన్ని, మదాన్ని, నాశనం చేసి వివేకాన్ని కలిగిస్తుందని ఇందులోని ఋషి హృదయం.
–శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి