Monday, November 25, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -12 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
12.
అలంవ్రతై: అలం తీర్థై: అలం యోగై: అలం మఖై:
అలం జ్ఞాన కధాలాపై: భక్తి రేకైవ ముక్తిదా

వ్రతములు, తీర్థములు, యోగములు, యాగములు వీటితో ఎంతో ఆలస్యంగా ఎన్నో జన్మల తరువాతే మనం పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలం. కానీ ఏ శ్రమలేకుండా ఒక్క భక్తి ఉంటే చాలు వెంటనే ముక్తి లభిస్తుంది. వ్రతాలు, తీర్థ పర్యటనలు, యోగములు, యాగములు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు మాత్రమే. భక్తి అంటే భగవంతుని పై భారం వేయడం మనం చేసే ప్రయత్నంతో పరమాత్మ ఎప్పుడూ ప్రసన్నుడు కాడు. అసలు పరమాత్మను ప్రసన్నం చేయగల ప్రయత్నం మన దగ్గర ఉంటుందా? అతనను కావాలనుకుంటే కాపాడుతాడు.

పసిపాపని నా పిల్లవాడు, నేనే కాపాడాలి అనుకుంటే కదా తల్లి పాలిచ్చేది. ప్రేమ లేని తల్లి పిల్లవాడు ఏమి చేసినా దగ్గరకు తీసుకోదు కదా. అలాగే పరమాత్మ దయ కలిగితేనే రక్షిస్తాడు. నన్ను రక్షించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటేనే సరే చె య్యి అని చూస్తాడు. నీదే భారం స్వామి అని ఆయన మీద భారం వేస్తే వెంటనే వచ్చి కాపాడుతాడు. ద్రౌపది, గజేంద్రుడు పరిపూర్ణంగా భగవంతుని పై భారం వేసినప్పుడే అంటే తమను రక్షించుకోవడానికి తాము ప్రయత్నం చేయడం మానినపుడే స్వామి వచ్చి కాపాడాడు. మనం ప్రయత్నం మాని భగవంతునిపై నమ్మకం ఉంచి అతని పై భారం వేయడాన్ని భక్తి అంటారు. భగవంతుని పై నమ్మకం, ప్రేమ భగవంతుడంటే ప్రీతి ఇవే భక్తికి నిర్వచనం. అలాంటి భక్తి ఉన్న తరువాత ఇంకా వ్రతాలు, తీర్థాలు, యాగాలు, యోగాలు ఎందుకని ఈ శ్లోకంలోని ఋషి హృదయం

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement