Tuesday, January 7, 2025

ధర్మం – మర్మం : ఋషి హృదయం, భాగవత వైభవం -11 (ఆడియోతో…)

పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
11

భక్తి
భక్తి ద్రోహకరాయేచ తే సీదంతి జగత్రయే
దుర్వాసా: దు:ఖమాపన్న: పురాభక్తి వినిందక:

భక్తికి ద్రోహం చేయాలనుకున్నవారు, ద్రోహం చేసిన వారు మూడు లోకాలలో కష్టాలు పాలు అవుతారు.

అత్రి అనుసూయకు రుద్రాంశతో కలిగిన మహర్షి దూర్వాసుడు కావున దూర్వాస మహర్షి సాక్షాత్తు శంకరావతారమే. దూర్వాస మహర్షి పరమ భక్తాగ్రేసరుడైన అంబరీషుడిని, ఏకాదశీ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని పరీక్షించాలని సంకల్పించి ద్వాదశి పారణ ఘడియలకు కొంత ముందు అంబరీషుని వద్దకు రాగా ఆయన దూర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించగా స్నానమాచరించి వస్తానని చెప్పి నదికి వెళ్లిన దూర్వాసుడు పారణ సమయం దాటేంత వరకు అక్కడే ఉండిపోయెను. వేచి చూస్తున్న అంబరీషుడు ఇతర ఋషుల సూచన మేరకు జలపానం చేయగా అపుడు వచ్చిన దూర్వాస మహర్షి తనను భోజనానికి పిలిచి, నీవొక్కడివే తింటావా అని ఆగ్రహించి కృత్యను సృష్టించి అంబరీషుని పైకి విడువగా స్వామి చక్రము, ఆ కృత్యను దహించి దూర్వాసుని వెంటపడెను. తనను తాను కాపాడుకోవడానికి దూర్వాసుడు అన్ని లోకాలకు వెళ్లి బ్రహ్మ రుద్రేంద్రాదులను దర్శించి చివరకు వైకుంఠానికి వెళ్లి శ్రీమన్నారాయణుని ప్రార్థించగా తాను భ క్త పరాధీనుణ్ణని, తన ఆయుధాలు, తన సర్వ సంపదలు భక్తుల కోసమే కావున నీవే అంబరీషుడిని ప్రార్థించు అని స్వామి పంపించివేసెను. అపుడు దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్లి ప్రార్థించడానికి పూనుకోగా మహానుభావా! మీ ఆశీస్సులు చాలు మీ ప్రార్థనతో నన్ను చిన్నవాడిని చేయకండి అని చక్రరాజాన్ని స్తోత్రం చేసి ఉపసంహరింప చేశాడు.

భక్తికి, భ క్తి కలవారికి, ఆపద కలిగించాలనుకున్న వారు ఎంతటి వారైనా అవస్థల పాలు కాక తప్పదు అనే సత్యాన్ని లోకానికి చాటడానికి దుర్వాస మహర్షి ఈ చిన్న నాటకం ఆడాడు, ఆడించాడు లేకుంటే భక్తులకు కల్పవృక్షమైన శంకరుడు భక్తులకు ఇబ్బంది కలిగించడమేమిటి? భక్తుల మహిమను, భక్తి మహిమను లోకానికి బోధించాలనే ఈ చిన్న సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. భగవంతుడిని నిందించినా సహిస్తాడు కాని భ క్తులకు అపకారం కలిగిస్తే క్షమించడు అనేది ఇక్కడ ఋషి హృదయం

–శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement