Tuesday, December 10, 2024

ధర్మం – మర్మం : ఆచరణ (ఆడియోతో…)

మహాభారతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

అనుష్ఠాన విహీనానాం అస్మాన్‌ అభ్యసతాంభువి
క్లేశోహి కేవలం దేవ నాస్మదభ్యసనే ఫలమ్‌
అనుష్ఠానం పరందేవ అస్మత్‌ అభ్యసనాత్‌ సదా
ఇత్యేవం రాజ శార్దూల వేదా ఊచుర్హి వేధసమ్‌
తస్మాత్స వేదాభ్య సనాత్‌ అనుష్ఠానం పరం మతమ్‌

ఆచరణ లేని వేదాభ్యాసం కేవలం ప్రయాస తప్ప ఫలము కలుగదని వేదములు తెలిపినవి. వేదమును అభ్యసించు వారి కంటే వేదము బోధించిన ధర్మములను ఆచరించుట విశిష్టమైనది. అందువలన వేదాభ్యాసం కంటే ధర్మ అనుష్ఠానమే శ్రేష్టమైనది. ఇదే విషయమును ‘జ్ఞానం భార: క్రియాం వినా’ అనగా ఆచరణ లేని జ్ఞానము బరువు మాత్రమేనని పురాణాలు ద్వారా తెలుస్తోంది.

‘ఆచారంహి వినా వేదా అభ్యాస: జ్ఞేయ: రాసభ భారవత్‌ ‘అని భారతం చెబుతుంది. అనగా వేదము చెప్పిన ధర్మమును అనుష్ఠానం చేయకుండా వేదార్థములు తెలియకుండా కేవలం వేదాభ్యాసం ద్వారా వచ్చిన వేదమంత్రాలు చదవటం గాడిద బరువు మోయడం వంటిది అన్నాడు విదురుడు. అత్యంత విలువ గల నాలుగు వజ్రాల సంచులను గాడిదపై వేసినా బరువే లేదని సంతోషపడుతుంది, అదే 100 కిలోల ఇనుము వేస్తే ఆ బరువును మోయలేక బాధపడుతుంది. తాను మోస్తున్న బరువు తప్ప ఆ బరువు విలువ తెలియనది గాడిద. అలాగే తాను చదువుకున్న మంత్రాల సంఖ్య తప్ప దాని అర్థం, ఆ అర్థమును ఆచరించుట తెలియని వాడు కూడా గాడిద వంటివాడే. అందుకే అభ్యాసం కంటే ఆచరణ అనగా అనుష్ఠానం గొప్పదని భావం.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement