Wednesday, November 20, 2024

ధర్మం – మర్మం : నరకచతుర్దశి (ఆడియోతో…)

నరక చతుర్దశి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శ్రీకృష్ణ పరమాత్మ ప్రాక్‌ జ్యోతిష్యపురమునకు వెళ్ళి సుదర్శన చక్రంతో నరకాసురుని సంహరించాడు. ప్రాక్‌ అనగా మొదలు(ముందు), జ్యోతి అనగా వెలుగు. వెలుగు కంటే ముందు ఉండేది చీకటి, చీకటిలో ఉండే వాడు నరకుడు. ‘నరక’ అనగా దుష్ట నరుడు అని అర్థం. సజ్జనులు అంథకారాన్ని ప్రకాశం చేస్తే, దుష్టులు ప్రకాశాన్ని అంధకారం చేస్తారు. చీకటి వెలుగుగా మారాలంటే సుదర్శనం కావాలి. ‘సుదర్శనం’ అనగా మంచిచూపు లేదా మంచిజ్ఞానం. జ్ఞానం అనగా ‘వెలుగు’. వెలుగుతో చీకటిని రూపుమాపడం, సంతోషంతో దు:ఖాన్ని తొలగించడం, జ్ఞానంతో అజ్ఞానాన్ని నిర్మూలించడం నరకాసురుని సంహారంలోని పరమార్థం.

ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రకృతి, మహాతత్త్వము, అహంకారము ఈ పదమూడికి బుద్ధితోడైతే పద్నాలుగు అదే చతుర్దశి. కృష్ణుడు సుదర్శనంతో నరకుడిని సంహరించాడనగా అపరిమితమైన ఆనందముతో, చక్కని జ్ఞానంతో, మంచి వెలుగుతో, అజ్ఞానాన్ని, దు:ఖాన్ని, చీకటిని తొలగించడమని నరకాసుర సంహారంలోని అంతరార్థం. దీనికి ప్రతీకగానే ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిలోని దంపతులను లక్ష్మీనారాయణులుగా భావించి ఇంటి ఆడపిల్లలు, వారికి మంగళహారతులు ఇచ్చి, అభ్యంగన స్నానం చేయిస్తారు. ఈ మంగళహారతి నరకాసురుడిని వధించిన సత్యభామా కృష్ణులకు దృష్టిదోషం తొలగడానికే. వారి విజయానికి సూచనగా ప్రతీ ఇంటి ముందు వెలిగించే దివ్వెలే సత్యభామాకృష్ణులకు మంగళహారతులని దీపావళి అంతరార్థం .

— శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement