తూర్పు, ఆగ్నేయం, దక్షిణము, నైఋతి, పశ్చిమము, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కుల అధిపతులను అష్టదిక్పాలకులుగా వ్యవహరిస్తారు.
వీరిలో ఈశాన్యం దిక్కు అధిపతిని గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
తూర్పు ఉత్తర మధ్యభాగమైన ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఈశ్వరుడు అధిపతిగా ఉన్న కారణ ంగా ఈ దిక్కుకి ఈశాన్యమని పేరు. త్రిమూర్తులలో ఒకడైన శంకరుడు తమోగుణసంభూతుడు, లయాధిపతి, నిత్యతపస్వి. ‘జ్ఞానంతు శంకరాధిచ్చేత్’ అని స్మృతి వాక్యం. అనగా శంకరుడు జ్ఞానప్రదాత. దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు, తన తపస్సుని భగ్నం చేసిన కారణంగా మన్మథుడిని తన మూడో కంటితో భస్మం చేసినవాడు శంకరుడు. దక్షప్రజాపతి పుత్రిక, శంకరుని మొదటి భార్య అయిన సతి, దక్షయజ్ఞంలో తన శరీరాన్ని విడిచిపె ట్టగా తిరిగి కొంత కాలానికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని వివాహమాడాడు. అంధకాసురుడు, భస్మాసురుడు, వృకాసురుడు వంటి దానవులను సంహరించి లోకోపకారము చేసినవాడు శివుడు. నారాయణుడు ఎక్కడ అవతరించినా అతని వెంటే తాను అవతరించాడు. నారాయణుడు రాముడైతే, శంకరుడు ఆంజనేయుడయ్యాడు. ప్రసిద్ధిగాంచిన విష్ణుక్షేత్రాలలో క్షేత్రపాలకుడు శంకరుడే. అలాగే శివక్షేత్రాలలో విష్ణువు క్షేత్రపాలకుడు. దేవతల ప్రార్థనతో క్షీరసాగరమధనంలో పుట్టిన విషాన్ని తాగగా కడుపులోని లోకాలు కల్లోలమవుతాయని కంఠంలోనే నిలుపుకొని నీలకంఠుడయ్యాడు. వాసుకి, తక్షకుడు మొదలగు మహాసర్పాలకు కల్గిన ఆపదను తప్పించడానికి వాటిని ఆభరణాలుగా ధరించి సర్పభూషణుడయ్యాడు. ఆహార్యం ఆస్తి, ఆవాసం ఇవి హృదయానికి సూచికలు కావని చల్లని హృదయం ఉంటే పూజాపాత్రులవుతారని లోకానికి చాటినవాడు శంకరుడు. శంకరుడు గంగాధరుడు కావున ఈశాన్యం జలావాసం అయ్యింది.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి