Thursday, December 12, 2024

ధర్మం – మర్మం : మార్గశీర్ష బహుళ అష్టమి (ఆడియోతో..)

మార్గశీర్ష బహుళ అష్టమి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మార్గశీర్ష బహుళ అష్టమిని ‘అష్టక’ అందురు. మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ బహుళ అష్టములను ‘అష్టక చతుష్టయం’ అని అందురు. ఈ నాలుగు అష్టకములలో శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించవలెనని అశ్వలాయన మహర్షి చెప్పెను. నాలుగు నెలలు చేయలేని వారు ఒక అష్టమి నాడైనా వ్రతమాచరించవలెనని హరదత్త మహర్షి తెలిపెను. అష్టమికి ముందు సప్తమి నాడు కూడా పితృదేవతల ప్రీతి కొరకు శ్రాద్ధములను ఆచరించవలెనని కాలదర్శిని ద్వారా తెలుస్తోంది.

మార్గశీర్షేచ పౌసేచ మాఘే ప్రౌష్ఠేచ ఫాల్గుణ
కృష్ణ పక్షేచ పూర్వేద్యు: ఆన్వష్టక్యం తధాష్టకా:

అనగా మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ, భాద్రపద మాసముల కృష్ణ పక్షములోని అష్టమి తిథులలో లేదా అష్టమి ముందు వెనుక తిథులైన సప్తమి, నవమి తిథులను అన్వష్టకములు అందురు. ఈ అష్టకములు, అన్వష్టకములలో పితృదేవతలకు ప్రీతికరంగా స్నాన, దాన, తర్పణ, శ్రాద్ధ, హోమ జ పాదులతో ఆరాధించిన సకలాభిష్టములు సిద్ధించి పుత్ర పౌత్ర సమృద్ధితో అలరారెదరని విష్ణుస్మృతి ద్వారా తెలుస్తోంది. కూర్మ పురాణంలో అన్ని అమావాస్యలలో, అష్టకములలో, అన్వష్టకములలో కృష్ణ చతుర్ధులలో కూడా పితృ ఆరాధన చేయవలెనని చెప్పియున్నారు.

అమావస్యాష్టకా స్తిశ్ర: పౌషమాసాదిషు త్రిషు
యాచాప్యన్యా చతుర్ధిస్యాత్‌ తాంచకుర్యాత్‌ ప్రయత్నత:

- Advertisement -

అని వాయు బ్రహ్మాండ పురాణాలలో చెప్పబడి ఉంది.

‘శ్రాద్ధమేతే ష్వకుర్వాణ: నరకం ప్రతిపద్యతే’ పైన చెప్పిన అమావాస్య, అష్టక, అన్వష్టక తిథుల యందు శ్రాద్ధమును ఆచరించనివారు నరకమును పొందెదరని విష్ణుస్మృతి. ఈ అష్టకములలో, అన్వష్టకములలో శ్రాద్ధమును అపూపాదులతో చేయవలెను. మూడవ అష్టకం శాక విశేషములతో చేయవలెను. ఇవి కాక మహాలయ అష్టకములు అనగా మహాలయ అమావాస్య తరువాత వచ్చే అష్టకములలో పితృదేవతారాధన చేయవలెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement