Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : లలితా త్రిపుర సుందరీ (ఆడియోతో..)

లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలోని అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ:

‘లలితా’ అనగా లాలించేది. లాలన అంటే దు:ఖాన్ని, భయాన్ని తొలగించేది. కష్టాల వల్ల దు:ఖము, ఆపదల వల్ల భయము కలుగుతాయి. అటువంటి కష్టాలను, ఆపదలను తొలగించే తల్లి ‘లలితా’. ‘సర్వదేవమయి లలితా’ని లలితా వైభవంలో వివరించబడింది. బ్రహ్మాండపురాణంలో మరియు హయగ్రీవ అగ స్త్య సంవాదంలో లలితావైభవాన్ని చక్కగా వివరించారు. త్రిమూర్తులకు, త్రిలోకాలకు, త్రిజగాలకు, త్రిగుణాలకు లలితే మూలాధారం. దేవతలందరూ ఈమె నుండే ఆవిర్భవించారని, ఆర్తితో ఆరాధించేవారిని రక్షించే త్లలీ లలితాదేవని పురాణగాథ.
ఇహ, పరలోకాలలోని బాధలను తొలగించి ధర్మార్థ కామ పురుషార్థాలను ప్రసాదించి అడిగినవారికి, అడగనివారికి తల్లిగా ప్రియాన్ని, హితాన్ని అందిస్తుంది ఈ తల్లి. ఎవరి మనస్సు నొప్పించక అందరిని మంచి దారిలో నడిపే సాత్వికమూర్తి లలితాదేవి. లలితంగా అంటే సుతిమెత్తగా, కష్టపెట్టకుండా మనస్సుకు నచ్చేలా, తన పిల్లలమైన మనకి కావలసింది ప్రసాదించే అమ్మ లలితా. జగమంతటకీ తల్లి అయిన ఆమె పిల్లలమైన మనము ఎన్ని తప్పులు చేసినా శిక్షించకుండా చేతిలో ఇక్షుదండము(చెరుకుగడ) ధరించి ఉంటుంది. తీయగా ఉండే చెరుకు రసాన్ని ఆస్వాదించాలంటే కష్టమైనా గట్టిగా ఉండే చెరుకు గడను బాగా నమలాలి. అలాగే ప్రతీ సుఖంలో దు:ఖంలాగా, ప్రతీ సంపదలో ఆపదలాగా, ప్రతీ మంచిలో కొంత చెడులాగా శ్రమిస్తేనే ఫలం వస్తుందని దానిలోని పరమార్థం. చెరుకుపప్పిలోని రసాన్ని స్వీకరించినట్లుగా చెడులో ఉన్న మంచిని స్వీకరించాలి.అదేవిధంగా చెరుకును నమలగా వచ్చిన పిప్పిని ఏవిధంగా పారవేస్తామో మంచితో ఉన్న చెడును తొలగించాలని ఇక్షుదండ ంలోని ప రమార్థం. అదేవిధంగా జీవుల అపరాధాలను తొలగించి, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానానందాలను ప్రసాదించే తల్లి లలితాదేవి.

నైవేద్యం : చెరుకురసం, పానకం, దద్యోదనం, క్షీరాన్నం

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement