పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామనుజాచార్యుల వారి వివరణ…
28.
సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్యా:
నివసతి హృదియేషాం శ్రీహరే: భక్తిరేకా
హరి రపి నిజలోకం సర్వధాతో విహాయ
ప్రవిశతి హృది తేషాం భక్తి సూత్రోప నద్ధ:
అఖిలాండ కోటి బ్రహ్మాండములలో, అన్ని లోకములలో హృదయమున శ్రీహరి యందు భక్తి కలవారు ధన హీనులైనా ధన్యులే. శ్రీహరి కూడ తన
లోకమును పూర్తిగా విడిచి పెట్టి భక్తి సూత్రముతో కట్టబడి వారి హృదయంలో ప్రవేశించును.
ధన్యా అన్న శబ్ధమునకు ధనము కలవారు అని అర్థం. ధనముంటే అన్ని ఉన్నట్టే అనుకుంటారు అందుకే ధనము కలవారే ధన్యులనుకుంటారు కానీ
హృదయమున పరమాత్మ యందు భక్తి ఉన్నవారు ధనము లేకున్నా ధన్యులు. ఎందుకంటే అలాంటి భక్తుల హృదయంలో శ్రీహరి వైకుంఠాన్ని విడిచి వచ్చి చేరినపుడు ల క్ష్మీదేవి కూడా స్వామి వెంట వస్తుంది. లక్ష్మీనారాయణులు ఇద్దరూ హృదయంలో ఉంటే అన్ని ధనాలు ఉన్నట్టే హృదయంలో లక్ష్మీనారాయణులు ఉన్నవారే నిజమైన ధనవంతులు మిద్దెలు, మేడలు, కోట్లు ఉన్నవారు వాస్తవంగా ధనవంతులు కాదు. లక్ష్మీనారాయణులు భక్తి ఉన్న వారి హృదయాలలో మాత్రమే ఉంటారు. అందుకే భక్తి కలవారే ధన్యులు.
– శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి