పద్మపురాణంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
20.
తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపో ధనా:
యావన్ నశ్రూయతే సమ్యక్ శ్రీమత్ భాగవతం నరై:
శ్రీమత్ భాగవత కథను విననంత వరకే మానవుల దేహములో పాపాలు నివసిస్తుంటాయి. భాగవత కధ వినిన వెంటనే అన్ని పాపాలు నశిస్తాయి అని భావము.
పాపము అంటే పరమాత్మ కోపము, పుణ్యము అంటే పరమాత్మ సంతోషము. పరమాత్మ చెప్పిన వేద శాస్త్రములను అందులో చెప్పిన విధులను ఆచరించ నందున పరమాత్మ ఆజ్ఞను ధిక్కరించడం అవతుంది. ‘సత్యం వదా, ధర్మం చర’ అనేది స్వామి ఆజ్ఞ. మరి మనం సత్యం వధా అని సత్యాన్ని రూపుమాపి అసత్యం పలుకుతూ ధర్మానికి బదులు అధర్మాన్ని ఆచరిస్తే స్వామికి కోపం రావడం సహజం. దీన్నే పాపం అంటారు. స్వామి చెప్పినట్లు విని సత్యమును, ధర్మమును పాటిస్తే స్వామికి సంతోషం కలుగుతుంది ఇదే పుణ్యం. ఇలా పాప-పుణ్యాలు భగవానుని కోప-సంతోషాలు. మరి భాగవత కథలో భగవంతుని మాట విన్న వారు పొందిన సద్గతిని, భగవంతుని మాట వినని వారి దుర్గతిని, వారి కథలను, వారు పాపాన్ని పోగొట్టుకున్న విధానాన్ని చాలా విపులంగా వివరించారు. కావున భాగవతం చదివితే ఇక ముందు ఇలాంటి తప్పును చేయవద్దు అనే భావన కలుగుతుంది. దీన్నే పశ్చాత్తాపం అంటారు. మన పశ్చాత్తాపం కూడ పరమాత్మకు సంతోషాన్ని కలిస్తుంది. తప్పు చేస్తున్నవాడు తాను చేస్తున్నది తప్పని తెలుసుకున్నా పరమాత్మకు సంతోషమే. ఇలా తెలుసుకున్న వాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేయడం మానుతాడు. వాటిని విని కూడా మనం తప్పులు చేస్తే వారి లాగ నరక బాధలను పొందుతాం. అందుకే చేస్తున్నవి తప్పులని ఇక తప్పులు చేయకూడదని తెలిపే భాగవతం విన్నా చదివినా పరమాత్మకు కోపం పోయి సంతోషిస్తాడు. అంటే మన పాపం పోతుంది. అందుకే పాపాన్ని తొలగించుకోవడానికి భాగవతాన్ని వినాలి. భాగవతం విననంత వరకే మన శరీరంలో పాపాలు ఉంటాయి అన్న మాటకు అర్థం ఇదే.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి