గోవింద నామ ప్రాశస్త్యం గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
నారాయణునికి గోవిందనామం చాల ప్రీతిపాత్రం. గో శబ్ధానికి స్వర్గ, ఇషు, పశు, వాక్కు, వజ్ర, ఘృణి, నేత్ర, అంబు, వృష్ణి అను 9 అర్థాలున్నాయి.
గో అంటే స్వర్గము, స్వర్గ శబ్ధానికి అర్థం మళ్ళీ తిరిగి రానిది. అంటే ఒక్కసారి స్వర్గానికి వెళ్లితే మళ్లిd ప్రకృతిలోకి తిరిగిరాము అదే వైకుంఠము. గోవిందుడంటే వైకుంఠమును ఇచ్చువాడు అని అర్థము.
ఇషు అంటే ప్రణవము, ధనువు, శరము, ఆత్మ అని వేదము చెపుతుంది. గో అంటే శరము అనగా ఆత్మ. ఆత్మను తన వద్దకు చేర్చుకునేవాడు గోవిందుడు.
గో అంటే పశువు, గోవులను కృష్ణావతారమున గోవర్ధనమెత్తి కాపాడాడు కావున కృష్ణుడు గోవిందుడు.
గో అంటే భూమి, వరాహావతారములో భూమిని రసాతలం నుండి పైకి తెచ్చి కాపాడిన వరాహస్వామి గోవిందుడు.
గో అంటే వాక్కు. వాక్కులు అనగా వేదములు. సోమకాసురుడు, హయగ్రీవాసురుడు వేదాలను హరిస్తే మత్స్యావతారంతో, హయగ్రీవ అవతారంతో వేదాలను రక్షించాడు స్వామి. అందుకే గోవిందుడంటే మత్స్యమూర్తి, హయగ్రీవ స్వామి.
గో అంటే వజ్రం. వృత్తాసుర సంగ్రామంలో నారాయణుడు ఇంద్రునికి దధీచి అస్థికలతో వజ్రాయుధం చేయించి ఇచ్చిన వాడు నారాయణుడు
గోవిందుడు.
గో అంటే ఘృణి అనగా కిరణము. సూర్యునికి, చంద్రునికి, అగ్నికి తానే కిరణరూపంలో ప్రసరించుచూ లోకాలకు వెలుగును, వేడిని, వెన్నెలను ఇస్తున్న స్వామి గోవిందుడు.
గో అంటే నేత్రము. సకల లోకములలో ఆచరించు కర్మలకు సాక్షిగా అంటే కన్నుగా ఉంటూ అన్నిటిని, అందరినీ చూసే సూర్యభగవానుడు గోవిందుడు.
గో అంటే అంబు అనగా జలము. సకల లోకములకు ప్రాణాధారమైన జలమును ఇచ్చువాడు, సూర్య రూపములో జలమును తీసుకొని తిరిగి జలమును ఇచ్చు సూర్యుడు గోవిందుడు. జలములో నివసించు నారాయణుడు గోవిందుడు.
వృష్ణ అంటే వర్షానికి గోవు అని పేరు. వర్షానిచ్చే పర్జన్యుడు వరుణుడు గోవిందుడు. వృష్ణ వంశాన్ని అంటే యదు సంతానాన్ని తాను అవతరించి కాపాడిన కృష్ణుడు గోవిందుడు.
ఇక భృగు మహర్షి పాదం తన వంటికి తాకినదని అలిగి వెళ్ళిన లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చిన నారాయణుడు పుట్ట లో నివసిస్తే అక్కడికి బ్రహ్మ గోరూపంలో వచ్చి పాలిచ్చి ఆకలి తీర్చాడు. గోవు వలన మనగలిగాడు కావున వేంటేశ్వరుడు గోవిందుడు. గోవు అంటే పుణ్యము, వేంకట అంటే పాపాలు పోగొట్టువాడు. పుణ్యాలు ఇచ్చి పాపాలు పోగొట్టువాడు వేంకటేశ్వరుడు. గోవిందుడు అన్ని అవతారాలలో గోవులను కాపాడితే వేంకటేశ్వరుడిని గోవు కాపాడినది అందుకే వేంకటేశ్వరునికి గోవింద నామం చాలా ఇష్టం.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి