Monday, November 25, 2024

ధర్మం – మర్మం : మహిషాషురమర్దినీ దేవి (ఆడియోతో..)

మహిషాషురమర్దినీ దేవి అవతార అంతరార్థం – పరమార్థం గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ

మహిషాషురుడు ఘోరమైన తపము చేసి మరణము లేని వరమును కోరాడు. పుట్టిన వారు గిట్టక తప్పదు కావున మరో వరం కోరుకోమని బ్రహ్మ సూచించగా పదహారు నుండి ఇరవైనాలుగు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న యువతి చేతిలోనే మరణాన్ని కోరుకున్నాడు. తన బల పరాక్రమాల ముందు స్త్రీ, స్త్రీ శక్తి ఎంతన్న చులకన భావంతోనే ఈ వరం కోరుకున్నాడు. అతనిని వధించడానికే జగన్మాత అవతరించింది. జగన్మాతను వక్ర దృష్టితో చూడటం వలన రక్తబీజుడు, శుంభ , నిశుంభులు ఇలా అనేక మం ది అసురులు సంహరింపబడిన పిదప మహిషాషురుడు అమ్మతో యుద్ధం చేసి వధించబడ్డాడు. మహిషాషురుడిని వధించిన తల్లి మహిషాషురుమర్దిని. ‘మహి’ అనగా భూమి మీద, ‘షా’ అనగా ఉండువాడు. అంటే మహిషాషురుడు అనగా భూమి మీద ఉండువాడు. త మోగుణ భూయిష్టమైన ఈ భూమి మీద ఉండేవారు పూర్తిగా ఆ గుణాన్ని అలవర్చుకున్నవారు. తమోగుణ లక్షణాలైన నిద్ర, తంద్ర(సోమరితనం) భయం, క్రోధం, ఆలస్యం వంటి వాటిని సంహరించేది తల్లి. ఇవి కోరికలతో నాలుగు, కోపంతో మూడు, లోభంతో మూడు దోషాలు. ఈ విధంగా మొత్తం పది దోషాలు అనగా పది పాపాలు. ఈ పది పాపాలు కలవాడు మహిషాషురుడు.

మనస్సుతో మూడు, శరీరంతో నాలుగు, వాక్కుతో మూడు కలిపి పది తప్పులు కూడా పది పాపాలే. ఈ పది పాపాలను హరించుట అనే పండుగను ‘దశహరా’ అంటాం. ‘దశ’ అనగా పది ‘హరా’అనగా తొలగించేది అని అర్థం. పదిపాపాలు, పది దోషాలు కలిగిన ప్రతీ వ్యక్తి మహిషాసురుడే. మనలోని పదిపాపాలను తొలగించేది బుద్ధి, ఆ బుద్ధినే మహిషాసురమర్దిని, దశహరి అని అంటారు. ఆ బుద్ధిని, బుద్ధిరూపంలో ఉన్న జగన్మాతను మహిషాసురమర్దినిగా పూజించే దినమును ‘దశహరా’గా వ్యవహరిస్తారు. దీనినే వాడుకభాషలో ‘దసరా’గా పేర్కొంటారు. ఆనాడు మంచి బుద్ధితో తల్లిదండ్రులను పూజించి పదిమందికి మంచిని పంచాలి.

మహిషాసుర మర్దినికి ప్రియమైన నైవేద్యం దోశలు, బూరెలు, ఆవ నూనెతో పులిహోర

- Advertisement -

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్య..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement