Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం

గంగా ఆవిర్భావ వృత్తాంతములో భాగంగా భగీరథుని గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

సగర చక్రవర్తి మనమడు అయిన అంశుమంతుని కుమారుడు తేజోవంతమైన దిలీపుడు అతని కుమారుడు బుద్ధిమంతుడైన భగీరధుడు. భగీరధుడు తన ముత్తాతలయిన సగరపుత్రుల దుర్గతిని విని దు:ఖించినవాడై సగర మహారాజును తన ప్రపితామహులకు పాపనివృత్తి జరిగి సుగతి ఎలా లభించునని ప్రశ్నించెను. దీనికి తరుణోపాయమును కపిల మహర్షిని ప్రార్థించి తెలుసుకొనమని సగర చక్రవర్తి చెప్పగా భగీరధుడు రసాతలానికేగి కపిల మహర్షికి నమస్కరించి భక్తితో, వినయముతో జరిగిన విషయములను నివేదించి నిష్కృతిని తెలుపమని ప్రార్థించెను. కపి లుడు ధ్యానంతో నిష్కృతిని తెలుసుకుని శంకరుని నియమనిష్ఠలతో ఆరాధించి అతని జటలలో ఉన్న గంగతో నీ ప్రపితామహుల భస్మరాశులను ముంచి వేసినచో వారు ఉత్తమగతిని పొందెదరని మరియు నీవు కృతార్థుడవు అయ్యెదవని తెలిపెను. భగీరధుడు కపిల మహర్షి కి నమస్కరించి తాను ఏ విధంగా చేయాలో దయతో తెలుపమని ప్రార్థించగా కైలాస పర్వతమునకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో శంకరుని స్తోత్రము చేసి, శక్తి మేరకు తపస్సు ఆచరించమని చెప్పెను. శంకర భగవానుడు భక్తవరదుడు, దయామయుడు కావున నీ కోరిక తప్పక నెరువేరునని చెప్పగా అది విన్న భగీరధుడు కపిలునికి సాష్టాంగ నమస్కారమును సమర్పించి కైలాసపర్వతమునకేగెను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement