Wednesday, December 25, 2024

ధర్మం – మర్మం : ఋషి హృదయం – 1(ఆడియోతో…)

శ్రీ మద్భాగవతములోని ఏకాదశ స్కంధములోని శ్లోకానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విరవణ..

1. భూతానాం దేవ చరితం దు:ఖాయచ సుఖాయచ
సుఖాయైవహి సాధూనాం త్వాదృశాం అచ్యుతాత్మనామ్‌

దేవతల చరితము ప్రాణులకు దు:ఖము, సుఖమును కలిగించునని, నీలాంటి భగవద్భక్తులైన సాధువుల చరితము కేవలము ఆనందమును మాత్రమే కలిగించునని వసుదేవుడు నారద మహర్షితో చెప్పెనని పై శ్లోకమునకు భావం.

ఇది ఒక లోకోత్తర చరితమును సత్యమును చాటు వాక్యము. మనకు ఆనందము ప్రియము కలిగినపుడు మరొకరికి దు:ఖము, అప్రియము కలుగును. మనకు ప్రియం కలిగితే ఆనందం, అప్రియం కలిగితే దు:ఖం కలగడం సహజం కానీ మనకే కాక ఇతరులకు ప్రియాప్రియములు కలిగినా మనసు కరిగి దు:ఖం కలిగినపుడే కరుణ, జాలి హృదయం కలవారందురు. ఈ విధానంగానే దేవతల చరితమున కూడా ప్రియాప్రయములు, సుఖ దు:ఖములు ఉండును. రామ చరితమున అరణ్యవాసం, సీతా వియోగము, రాజ్య భ్రంశము అలాగే కృష్ణావతారమున తల్లిదండ్రులతో ఎడబాటు, ఇతరుల వద్ద పెరుగుట, నీలాపనిందలు ఇత్యాది అప్రియములు తెలిసిన మనకు స్వామికే ఇంతటి కష్టములా అని అనిపించక మానదు. సీతా చరితమున సీత పాట్లు అందరికీ తెలసినవే అలాగే ఇంద్రాది దేవతలు, రాక్షసుల వలన పడిన బాధలు చివరికి రాక్షస విజయములు గూర్చి చదివినా, వినినా మనకు కూడా వారితో సమానముగా సుఖదు:ఖములు కలుగును. కావున దేవతల చరితము ‘దు:ఖాయచ సుఖాయచ’ అని అన్నారు.

సాధువుల చరితము అని అనక భగవంతుని యందు మనసు నిలిపిన సాధువుల చరితము అని అనుటలోని రహస్యం కేవలము సాధువుల చరితము అనగా వారికి కూడా భార్య, పిల్లలు, ఇల్లు వాకిలి ప్రియము అప్రియము ఇవన్నీ ఉండును. కానీ పరమాత్మ యందేమనసున్న సాధువులకు హితము తప్ప ప్రియముండదు. సర్వదా భగవంతుని ప్రియమునే కోరేదెరు లేదా లోకమునకు హితము కలుగువలయునని కోరెదరు. తాను బాగుండుటే కాక పరమాత్మ బాగుండవలయునని కోరెదరు. దీనినే విశిష్టాద్వైత సంప్రదాయమున మంగళాశాసనమందురు.

- Advertisement -

పెరియాళ్వార్‌ తనను చూడవచ్చిన స్వామికి పల్లాండు పాడినాడు. కొండ మీద నుండి కిందక పడబోతూ ఉన్న ప్రహ్లాదుడు పరమాత్మకు దెబ్బ తగలగలదని హృదయమును చేతులతో పట్టుకొనెను. ఈవిధంగానే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వృత్రాసురుడు భగవంతునికి శుభము కలుగువలయును అని ఆశించిరి. లోకమున కూడా సాధువులు ఇతరులకు హాని కలుగురాదని స్వామిని ప్రార్థిస్తారు. తనకు ఇతరుల కు మేలు జరుగవలయునని, తనకు కీడు జరగకుండా ఎదుటి వారికి మేలు జరుగవలయునని, తనకు కీడు కలిగిననూ ఇతరులకు మేలు జరుగవలయునని మూడు విధాలుగా కోరెదరు. లౌకికులు. పరమాత్మ యందు మనసు నిలిపిన వారికి జగమంతా పరమాత్మ మయమే పరమాత్మ కంటే భిన్నమే లేనప్పుడు మేలు, శుభము, హితము తప్ప కీడు, అశుభము, అహితమును ఎలా కోరెదరు.

ఎదుటి వారికి కీడు కలుగువలయునని కోరుట వారికి అప్రియము జరిగిన దానికంటే అధిక దు:ఖమును కలిగించును. మేలును, శుభ మును మాత్రమే కోరుట సుఖమును కలిగించును. దేవతల చరితమున మానవులలా వచ్చి మానవులకు హితమును బోధించు దేవతల చరితమును విన్నాము. ఇక భాగవతోత్తములకు, భగవ న్మంగళాశాసనము సర్వలోక క ళ్యాణకాంక్ష తప్ప ఇతరముండదు కాన అట్టి వారి చరితము కేవలము సుఖమునకు
మాత్రమే అని తాత్పర్యము. నీకు కలిగిన దు:ఖమును తొలగించుకొనుటకు ప్రయత్నించుట ధర్మము. కాని దాని కోసం ఎ దుటి వారికి దుఖమును కలిగించుట అధర్మము దు:ఖము కావున దేవతలైనా, మానవులైనా ”అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థ్సిత:’ అను సిద్ధాంతమును ఆకలింపు చేసుకొని అంతటా పరమాత్మను చూచి ఆ పరమాత్మ స్వరూపముగా నున్న జగత్తునకు హితమును, శుభమును కోరినచో అట్టివారి చరితము కేవలము ఆనందమునే కలిగించునన్నది ఋషి హృదయము.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement