Saturday, November 23, 2024

ధర్మం – మర ్మం : శ్రీ పంచమి (ఆడియోతో…)

పురాణాలలో శ్రీపంచమి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మాఘశుద్ధ పంచమిని పద్మపురాణంలో శ్రీపంచమిగా, స్కాందంలో వసంత పంచమిగా, విష్ణు ధర్మోత్తరంలో ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. న్యాయంగా వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు గావున వైశాఖ పంచమిని వసంత పంచమిగా లేదా చైత్ర పంచమిగా చెప్పుకొనవలెను. కానీ ఆర్ష(ఋషులు) సాంప్రదాయంలో రాబోవు ఋతువు పేరు మొదటే వ్యవహరించుట పరిపాటి. కావున మాఘ శుక్లపంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు. పద్మపురాణానుసారంగా లక్ష్మీదేవి భృగుమహర్షి పుత్రికగా ఈరోజు అవతరించినది గావున దీనిని శ్రీ పంచమి అని కూడా
వ్యవహరిస్తారు. ఇదే రోజున భృగుమహర్షి సమేతంగా 21 మంది ప్రముఖ ఋషులు కలసి లక్ష్మీ దేవిని సంతానముగా పొందవలెనని శ్రీయాగమును ఆచరించిరి కావున ఈ పంచమిని ఋషి పంచమి అని కూడా అందురు. బ్రహ్మపురాణానుసారం శ్రీ శబ్ధమునకు సరస్వతీ అనే అర్థమును చెప్పి భృగు మహర్షికి ఆమె పుత్రికగా అవతరించిన రోజుగా చెప్తారు. సరస్వతీ దేవిని మల్లె, జాజి, మరువక పుష్పాలతో ఆరాధించి ఉపవసించి యధాశక్తి దానాదులు ఆచరించిన శాస్త్ర పాండిత్యమును, మేథాసంపదను పొందెదరని చెప్పబడింది. దీని ఆధారంగా చాలామంది తమ పిల్లలకు అక్షర స్వీకార మహోత్సవము చేయుట పరిపాటి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement