Wednesday, December 18, 2024

ధర్మం – మర్మం : సాత్త్విక తప విధానము (ఆడియోతో…)

శివపురాణం ఉమాసంహిత 20వ అధ్యాయంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఉత్తమం సాత్త్వికం విద్యాత్‌ ధర్మ బుద్దిశ్చ నిశ్చలా
స్నానం పూజా జపోహోమ: శుద్ధి: శౌచం అహింసనమ్‌

వ్రతోపవాస చర్యాచ మౌనమింద్రియ నిగ్రహ:
ధీ: విద్యా సత్యమక్రోధ: దానం శాంతి: దమో దయా

వాపీకూప తటాకాదౌ: ప్రాసాదస్యచ కల్పనా
కృచ్ఛ్రం చాంద్రాయణం యజ్ఞ: సుతీర్ధాన్యా శ్రమా: పున:

ధర్మస్థానాని చేతాని సుఖాదీని మనీషిణామ్‌
సధర్మ: పరమోవ్యాస హరి భక్తేశ్చ కారణమ్‌

- Advertisement -

సాత్త్విక తపస్సు యొక్క ఆచరణ విధానాన్ని, స్వరూపాన్ని పై శ్లోకాలతో తెలియచున్నది. స్నానము, పూజ, జపము, హోమము, శరీర మానసిక వాక్‌శుద్ధి, అహింసావ్రతము, ఉపవాసము, మౌనము, ఇంద్రియములను నిగ్రహించుట, బుద్ధిని శాస్త్రాభ్యాసముతో ధరింపజేయుట, మోక్ష విషయకమైన విద్యను అభ్యసించుట, సత్యము, కోపము లేకుండుట, దానము చేయుట, ఓర్పు అనగా ఎదుటివాడు నిందించినా,
హింసించినా ప్రతిక్రియ చేయకుండా ఉండుట, మనస్సును నిగ్రహించుట, దయ, వాపి కూప తటాకాదులలో తాము నిలిచి సమాధిలో భగవత్‌ ప్రసాదాన్ని దర్శించగలుగుట.

కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతములు, యజ్ఞములు, పుణ్య తీర్థములకు వెళ్లుట, పుణ్యాశ్రమాలను దర్శించుట ఇవన్నీ వేద ప్రోక్తమైన ధర్మమునకు నిలయములు. ఇవి సాత్త్వికమైన సుఖమును, ఆనందమును కలిగించును. ఇది పరమ ధర్మం, శ్రీహరి భక్తికి కారణం అని వ్యాస భగవానునకు శంకరుడు బోధించిన విషయము.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement