Friday, November 22, 2024

ధనుర్మాస విశిష్టత (ఆడియోతో…)

ధనుర్మాస విశిష్టత గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

సౌరమానం, చాంద్రమానం అనేవి మనం పాటించే కాలమానాలు.

చాంద్రమానంలో చంద్రుని సంచారాన్ని అనుసరించి మాసముల పేర్లు నిర్ణయించబడతాయి. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసముగా వ్యవహరిస్తారు. చిత్త నక్షత్రంలో ఉంటే చైత్ర మాసమని, విశాఖలో ఉంటే వైశాఖ మాసం, మృగశిరలో ఉంటే మార్గశీర్షమని అంటారు.

సౌరమానం అనగా సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ మాసం గా వ్యవహరిస్తారు. మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసమని, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ మాసమని, ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసంగా ప్రతీతి. ధనుర్మాసం తరువాత సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినపుడు ఉత్తరాయణ పుణ్యకాలం, అలాగే కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతంది. దేవతలకు దక్షిణాయణం రాత్రి, ఉత్తరాయణం పగలు. మకర మాసం కంటే ముందు వచ్చు ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం వంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజాధికములు అధిక ఫలమునిచ్చును. వాటికి కావాల్సిన పూర్వ రంగం ధనుర్మాస వ్రతం. పరిశుద్ధమైన మనస్సు, పరమాత్మ యందు భక్తి, పరోపకార వాంఛ, లోకకల్యాణం ఇవన్నీ కాంక్షిస్తూ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి.

దీనిలో మరొక రహస్యం ఏమనగా వేదం ప్రణవం ధనువు ద్వారా ధనుర్మాస విశిష్టతను తెలియజేసింది. ధనువు అంటే ఓంకారం. ధనువులో మూడు వంపులు ఉంటాయి. వాటిని కలిపే ఒక తాడు ఉంటుంది. ప్రణవంలో మూడు వర్ణాలు ఉంటాయి. అకార, ఉకార, మకారాలు. ఆ మూడింటిని కలిపే ది జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి, పరిజ్ఞానం. ధనువులో ఒక చివర జీవాత్మ, మరొక చివర పరమాత్మ ఆరెండిటిని కలిపే తాడు ప్రకృతి లేక అమ్మ(ల క్ష్మీ దేవి). ఇలా జీవాత్మ పరమాత్మను చేరు సాధనాన్ని తెలిపే మాసం ధనుర్మాసం. ఈ సమయంలో చాంద్రమానం ప్రకారం మార్గశిరం. పరమాత్మను చేరుటకు ఉత్తమమైన దారిని చూపునది మార్గశిరం. తరువాత వచ్చే మాసం పుష్యం. పుష్యం అంటే ఆనందం. పరమాత్మను చేరే దారిని తెలుసుకున్న వారు పుష్య పూర్ణులు కాగలరు. ఈ నిగూఢ తత్వాన్ని తెలిపే మాసం ధనుర్మాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement