కార్తిక బహుళ చతుర్ధశి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ
కార్తికే కృష్ణ పక్షేతు చతుర్దాస్యాం ఇనోదయే
అవశ్య మేవ కర్తవ్యం స్నానం నరకభీరుభి: ||
అనగా కార్తిక బహుళ చతుర్ధశి నాడు ప్రభాత కాలమున చంద్రోదయ సమయంలో అభ్యంగన స్నానమాచరించవలయునని హేమాద్రిలోని నిర్ణయామృతంలో, భవిష్యోత్తరంలో చెప్పబడింది.
మదనరత్నంలో పేర్కొనబడిన ”కాలదర్శే విధూదయే” అనగా త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు కార్తిక కృష్ణ పక్షంలో ప్రత్యూష సమయంలో ప్రయత్నపూర్వకంగా స్నానమాచరించవలెను. అంటే నరక చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం ఉండగా చేసే అభ్యంగన స్నానం ఈనాడు ఆచరించాలి. ఈవిధంగా చేసినవారికి యమలోక దర్శనముండదని పురాణ వచనం. ఈనాడు ప్రత్యూష సమయంలో స్నానమాచరించినపుడు అపామార్గ(ఉత్తరేణు) పత్రమును, తుంబి పత్రమును, మోదుగు పత్రమును నీటిలో త్రిప్పుతూ క్రింది మంత్రమును పఠించవలెను.
సీతాలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాపం అపామార్గ భ్రామ్య మాణ: పున: పున: ||
అదేవిధంగా చతుర్దశినాడు, అమావాస్య నాడు ప్రదోష సమయంలో దీపదానం చేస్తే యమపురి మార్గానికి చేరరు. ఆనాడు నాలుగు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించి దీపం దానం చేస్తూ క్రింది మంత్రాన్ని పఠించాలి.
దత్తో దీప: చతుర్దాశ్యాం నరక ప్రీతయే మయా
చతుర్వర్తి సమాయుక్త: సర్వపాపాపనుత్తయే ||
ఆనాడు అన్ని ఆలయాలలో దేవతా వృక్షాల వద్ద దీపాన్ని వెలిగించాలి. కార్తిక కృష్ణ చతుర్దశిని ”ప్రేత చతుర్దశి”గా కూడా వ్యవహరిస్తారు.
చతుర్ధశి రోజు నువ్వులు కలిపిన నీటితో మూడు దోసెళ్లతో మూడు సార్లు యమతర్పణ ం విడిచి, దీపదానము చేయాలి. దక్షిణ ముఖంగా ఉండి సవ్యముతో, సావధానముతో, దేవతీర్థముతో, తిలలతో ప్రేతాధిపతియైన యుమునికి తర్పణం ఈయవలెను. యమతర్పణం మరియు భీష్మ తర్పణం ఈ రెండింటిని తండ్రి ఉన్నవారు కూడా చేయవలెను. ఈనాడు మాషపత్ర(మినుములు) శాఖముతో భుజించాలి.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి