యం యం వాపి స్మరన్ త్యజత్యంతే కలేవరం
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత:
(భగవద్గీత 8వ అధ్యాయం, 6వ శ్లోకం)
”ఓకౌంతేయా (అర్జునా), దేహాన్ని త్యజించిన సమయంలో మానవుడు ఏ భావాన్ని స్మరిస్తాడో, అదే భావాన్ని అతడు నిశ్చయంగా పొందుతాడని ఈ శ్లోకం భావం.
అనుక్షణం సంసార బంధమనే చట్రంలో బంధింపబడి, అరిషడ్వర్గాలకు లోనవుతూ, అంతులేని దు:ఖాన్ని పోగు చేసుకునే మానవులకు అతి దుర్లభమైన మోక్షం పొందే మార్గాన్ని గీతాచార్యుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.
మానవుడు మరణ సమయంలో తాను ఆలోచించిన దానినే మరుజన్మ లో పొందుతాడని ఉపనిషత్తులు తెలి యజేస్తున్నాయి. ఐహక వాంఛల గురించి ఆలోచించేవారికి వాటికి సం బంధించిన జన్మే లభిస్తుంది. అయితే మరుజన్మలో కూడా విషయ భోగాల వెనుక వెంపర్లాడే సంస్కారమే వచ్చి మోక్షం అనేది దుర్లభంగా మారు తుంది.
ఉదాహరణకు భరత మహారాజు అంత్యకాలంలో తాను పెంచుకుంటు న్న జింకను తలుచుకున్నందున మరుజన్మలో జింక జన్మ ఎత్తవలసి వచ్చింది. పూర్వజన్మ స్మృతులు వున్నా కూడా జీవిత పర్యంతం ఆ జింక దేహంలోనే కొనసాగవలసి వచ్చింది. జీవితకాలంలో ఆలోచనలే ప్రోగుపడి మరణ సమ యంలో మానవుల ఆలోచనలు ప్రభావితం చేస్తాయి కనుక ప్రస్తుత దే#హమే మరుజన్మలోని దేహానికి కారణమవుతుందని అర్ధం చేసుకోవాలి. అయితే అవసానదశలో భగవంతుడినే ధ్యానిస్తే ఆయన అపూర్వమైన కరుణా కటాక్షాలు లభ్యమౌతాయి. అందుకే చివరిదశలో ఇంద్రియ భోగాల నుండి పూర్తిగా విడిపడి భగవంతుని ధ్యానంలో గడపడం ఎంతో అవసరం.
చాలామంది వయస్సులో ఉన్నన్నాళ్ళు హాయిగా భోగభాగ్యాలు, సుఖసంతోషాలు అనుభవించి వృద్ధాప్యం వచ్చాక దైవ ధ్యానం చేసుకుందామని భావిస్తుంటారు. అయితే వృద్ధాప్యం అంటే మరణానికి దగ్గర అవడం అన్నమాటే. అనేక రోగాలు చుట్టుముట్టు తాయి, జీవితంలో చేసిన పాపాలు చేదు జ్ఞాపకాల రూపంలో మనసును ఛిద్రం చేస్తుంటాయి. ఇక బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు చుట్టూ చేరి మనల్ని అంతిమ యాత్రకు సిద్ధం అయినవారిలా చూస్తూ ఆస్తిపాస్తులలో తమకు వచ్చే వాటాల గురించి ఆలోచిస్తుంటారు.
మనకు కూడా యమపురి నుండి వస్తున్న యమకింకరులు లీలగా కనబడుతూ మరణం అంటే చెప్పలేని భయం కలిగి శరీరం ఆపాదమస్తకం కంపిస్తుంటుంది. ఇటువంటి పరిస్థితిలో దైవ ధ్యానం, దైవ దర్శనం చేయడం ఎంతమాత్రం సాధ్యంకాదు. అందుకే శారీరకంగా పటుత్వం వున్నప్పుడే సాధ న ప్రారంభించాలని వేదం చెబుతోంది. ఈ సాధన క్రమం తప్పకుండా చేస్తుంటే అవసాన దశ వచ్చే నాటికి ఉచ్వాస, నిశ్వాసాలలో కూడా భగవన్నామం స్మరించడం అలవాటవుతుంది. ఊపిరి ఆగే సమ యానికి భగవన్నామం మన నాలుకపై గాని, మనసులోగాని మెదిలితే మరుజన్మలో ఉత్తమ గతులు కలగడం ఖాయం అని శ్రీ కృష్ణ భగవానుడు పై శ్లోకం ద్వారా అభయం ఇస్తున్నాడు.
మానవులు సత్వగుణంలో నిలిచి దివ్యమైన భగవంతుని సేవలో నిలిచి తన పంచేంద్రియాలను సంపూర్ణ శరణాగతి భావంతో అర్పించినట్లయితే ఆతని తరువాతి దేహం, సంస్కారాలు భగవంతుని అనుగ్రహం వలన దివ్యమైనది అవుతుందని భగవానుడు మానవాళికి ఉత్తమమైన సాధనా మార్గాన్ని బోధించాడు.
- సి.హెచ్.ప్రతాప్ 98660 71785