ఎవరైతే అజ్ఞానాన్ని తొలగించుకుంటారో వారి జీవితం సార్ధకమౌతుంది. అజ్ఞానాన్ని తొలగించుకొని జీవితాన్ని సార్ధకం చేసుకునేందుకు సనాతన ధర్మం రెండు మార్గాలను చూపించింది. మొదటిది.. భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. పెద్దలు చూపిన మార్గంలో, ధర్మబద్ధమైన కర్మలతో నిరంతరం దైవారాధనతో జీవితాన్ని సాగించే మార్గమే భక్తిమార్గం. కాగా, సత్యాన్వేషణలో పంచకోశాలను శుద్ధిచేసుకొని, సకలానికీ ఆధారమైన భగవత్తత్త్వాన్ని అన్వేషించడం.. దానికై తపించడం, జితేంద్రియులై ”ఎఱుక”ను పొందడం జ్ఞానమార్గం. మొదటి విభాగం వారిని భక్తులుగానూ, రెండవ విభాగం వారిని జ్ఞానులుగానూ చెపుతారు.
భక్తులు తమకన్నా ఉన్నతమైన శక్తి మరొకటి ఉన్నదని భావించి.. దానినే దైవంగా విశ్వసిస్తూ.. ఆరాధిస్తూ ఉత్తమ గతులు పొందేందుకై త్రికరణ శుద్ధిగా, సర్వసమర్పణా భావనతో ఆరాధనాదులు చేస్తుంటారు. దైవము కూడా తనను శరణుపొందిన వారి బాధ్యతను పూర్తిగా తానే చూసుకుంటూ, అర్హత ప్రాతిపదికగా ఉద్ధరిస్తుంటాడు.
జ్ఞానులు ఈ సృష్టి సర్వమూ శక్తిమయమనే సత్యాన్ని గుర్తించి, తదనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ఉత్తమ గతులను పొందేందుకు తపిస్తూ ఉంటారు. వీరి బాధ్యతకు వీరే కర్తలు. భక్తులైనా, జ్ఞానులైనా కర్మలను ఆచరించడం అనివార్యం. ప్రతికర్మా తనదంటూ ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానులు తమ తపస్సుచే కర్మల ఫలితాన్ని పోగొట్టుకోగలమని భావిస్తూ తపిస్తుంటారు. దైవానుగ్రహమనేది దైవము అనుగ్రహిస్తే వస్తుందే కాని తపస్సుచేత సాధించడం సాధ్యపడదు. నిష్కల్మషమైన భక్తితో, సర్వసమర్పణా భావనతో ఆరాధించే భక్తుల కర్మఫలితాలను భగవంతుడే తొలగించి అనుగ్ర#హస్తాడు.
భక్తులలో కూడా మూడు రకాలుగా ఉంటారు. ఆర్తులు మొదటిరకం. వీరికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకు వస్తాడు. రోగాలు నొప్పులు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వీరు భగవంతునికి మొక్కుకుంటూ. ఆపదలు గట్టెక్కితే మొక్కులు తీర్చుకుంటుంటారు. రెండవరకం.. వారికి కోరికలు తీర్చుకోవడానికై భగవంతునితో బేరాలు పెడుతుంటారు. ఈ రెండు రకాలవారూ సకామ భక్తులుగా చెప్పబడుతారు. వీరిది సమర్పణా భావనతో కూడిన భక్తికాదు.
మూడవరకం జిజ్ఞాసువులు.. భగవత్ తత్త్వాన్ని తెలుసుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. వీరిలో సృష్టి వేరు, భగవంతుడు వేరనే భావన బలంగా ఉంటుంది. సృష్టికి అతీతంగా, ఉత్తమమైనది, ఉన్నతమైనది దేవుడని అతనిని ఆరాధిస్తే.. ఉత్తమగతులు లభిస్తాయని వీరిభావన.
నాలుగవరకం వారు.. జ్ఞానులు. వీరు ప్రపంచం భగవంతుని సృష్టికాదని భగవంతుని ప్రకటనయని విశ్వసిస్తూ.. అశాశ్వతమైన ప్రపంచానికి అతీతమైన భగవత్తత్త్వంలో బ్రహ్మానందాన్ని పొందేందుకై తపిస్తుంటుంటారు. జ్ఞానులు తమ కర్మలలో తప్పు జరిగితే పతనంచెందే అవకాశాలు ఉంటాయి. అందుకే వారు హేతుబద్ధమైన వివేచన, విచక్షణలతో నిరంతరం అన్వేషణ చేస్తుంటారు.
కర్తవ్యాన్ని నిర్వహించి పరిపూర్ణత్వాన్ని సాధించే ప్రయత్నం జ్ఞానులది కాగా, ఫలితం భగవదర్పితంగా కర్తవ్యాన్ని నిర్వహించేవారు భక్తులు. అయితే రెండు సంప్రదాయాలలో ఏ మార్గాన్ని అనుసరించినా క్రమశిక్షణ, ధర్మవర్తన తప్పనిసరి. ప్రలోభాలకు లోనైనా, సాధించిన శక్తులను స్వార్థానికి ఉపయోగించుకున్నా వారికి దక్కేది పతనావస్థయే. ఇలా భక్తిజ్ఞాన మార్గాలు రెండూ వేరయినా.. గమ్యము మాత్రము ఒకటే.
- పాలకుర్తి రామమూర్తి