Home భక్తిప్రభ వికసన… విస్తరణ

వికసన… విస్తరణ

0
వికసన… విస్తరణ

సృష్టికి ముందు దేనికీ ఉనికి లేదు.. అలాగని ఉనికి లేకుండా లేదు. సూర్య చంద్రాదులు గాని పంచభూతాలు గాని, జనన మరణాలు గాని లేవు. అంతటా గాఢాంధకారం ఆవరించి ఉన్నది. అయితే అంధకారం దేనిని ఆవరించి ఉన్నది? అంటే వెలుగును. ”పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు” అన్నారు పోతనగారు, భాగవతంలో. చీకటియే మాయ లేదా సమష్టి అజ్ఞానం. చీకటికావలి ”వెలుగు”నే ”శుద్ధ చైతన్యము” లేదా ”తెలివి” లేదా ”ఎఱుక” అంటాము. ఈ శుద్ధ చైతన్యమే ”సత్యం”. సత్యమంటే.. ఎప్పటికీ మార్పుచెందనిది, శాశ్వతమైనది. వెలుగుకు కలిగిన సంకల్పం నుండి ”మ#హత్తు” లేదా ”మాయ” లేదా ”చీకటి” దాని నుండి ప్రకృతి, ప్రకృతి నుండి సమస్త సృష్టి ప్రకటితమయ్యాయి. ప్రకటితమైన సృష్టి నంతటినీ క్రమపద్దతిలో నడపడం, రక్షించడం, పాలించడానికి.. కూడా ప్రజ్ఞ లేదా వెలుగే కారణమయింది. పాలించడం జరుగుతున్నది అంటే పాలితులు ఉన్నట్లే.
పాలకులు, పాలితులు అనే భావనలకు రూపమే.. త్రిమూర్తులు.. ఇంద్రాది దేవతల ఆవిర్భావం, వారి మ#హమలు.. ఇవన్నీ కథలుగా ప్రచారమయ్యాయి. తదుపరి ప్రజాపతులు, ఋషులు, పంచభూతాలు, మనువులు.. జీవకోటి ఆవిర్భావానికి కారణాలుగా చెప్పబడ్డాయి. వారి గాథలు సంప్రదాయతను సంతరించుకున్నవి.
వెలుగు నుండే సూర్యుడు, సౌరకుటుంబం ఏర్పడింది. వెలుగుల ముద్దగా ఏర్పడిన సూర్యుని నుండి ”వెలుగులు” భూమిపైకి ప్రసరించాయి. నిజానికి ఆ వెలుగులు సూర్యునివా? అంటే.. సూర్యుని కన్నా ముందుగానే బీజప్రాయంగా వెలుగులు ఉన్నాయి… ఆ వెలుగు బీజాలే లేదా విత్తనాలే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు.. ఇలా ఎన్నెన్నో రూపాలలో ప్రకాశమయ్యాయి. ఆ వరుసలో ఏర్పడినదే భూమి. సకారాత్మక, నకారాత్మక వెలుగులే సృష్టికి స్థిరత్వాన్నిచ్చాయి.
అనంతమైన శక్తికీ, పదార్ధానికి మూలమూ వెలుగులే, జీవుల శరీర నిర్మాణానికి కారణమూ వెలుగులే. మానవులీ భూమిపై కావాలని పుట్టకున్నా అస్తిత్వం కల్పించబడింది. అస్తిత్వంతో పాటుగా వారికి స్వార్థము, అహంకార మమకారాదులు అబ్బడం, పరిసరాల ప్రభావం, వాతావరణ ప్రభావం.. ఒకదానికి మరొకటి భిన్నంగా భావించడం.. క్రమంగా జరిగాయి. వీటన్నింటి కారణంగా మానవుడు తన మూలాలను గుర్తించడం మరిచిపోయాడు. దానినే అజ్ఞానంగా చెప్పుకుంటాము. అజ్ఞానాన్నుండి విమోచనం కలిగేందుకు మోక్షవిద్య అవసరమయింది.
సృష్టికి మూలమైన ఆ ”వెలుగుల” రహస్యాన్ని తెలుసుకునే జిజ్ఞాసయే విజ్ఞానానికి కారణమయింది. దార్శనికులైన ఋషులు తమ తపోభూమికలో దర్శించిన సత్యమే ”వేదమై” అవతరించింది. జ్ఞానమై ప్రవ‌హించింది. జ్ఞాన వికాసమే గాథల రూపంలో సకల జీవుల ఉద్ధరణకు… ఆత్మ మూలాలను అన్వేషించేందుకు, దర్శించేందుకు ఉపకరించింది. అదే భాగవత గాథలకు మూలమయింది.
కేవలము వేదాధ్యయనమో, శ్రద్ధగా కర్మాచరణయో వాటి పరమావధిని అందించకపోవచ్చు. భాగవత గాథలలో ఉన్న నారాయణుడనే సమన్వయంతో కూడిన ఏకత్వాన్ని దర్శింప గలిగిన వారు మాత్రం

తప్పక పరమావధిని అందుకుంటారని భావించవచ్చు. ఆ గాథల అక్షరాలను కాక పరమార్థాన్ని గ్రహించి జీవించుటయే వికసనగా, విస్తరణగా చెప్పుకోవచ్చు. వికసన భౌతిక జీవితాన్ని రసమయం చేస్తే.. విస్తరణ అత్యంత సూక్ష్మమైన ఆ ”వెలుగుల” సాంగత్యాన్ని అందిస్తుంది. అదే జీవిత పరమావధిగా చెప్పుకోవచ్చు.

  • పాలకుర్తి రామమూర్తి
Exit mobile version