Sunday, January 19, 2025

దమం… దయ… దానం!

శుక్ల యజుర్వేదంలో గల శతపథ బ్రాహ్మణంలో బృహదారణ్యకోపనిషత్తు ఉంది. ఇతర అన్ని ఉపనిషత్తులకంటే పరిమాణంలో ఇది బృహత్తరము (పెద్దది) కనుక దీన్ని బృహదారణ్యకోపనిషత్తు అని అంటారు. ఒక పరిమాణంలోనే కాక, విషయ విశిష్టత, వివరణ, సమగ్రతలన్నింటిలోనూ ఈ ఉపనిషత్తు విశేషమైనదే. దేవతలకు సహజ తత్త్వమైన భోగలాలసత్వం, అసురుల ప్రకృతియైన పర పీడన పరాయణత్వం, మానవుల అంతర్గత గుణమైన లోభం అనే ఈ మూడు అవలక్షణాలు మన సమాజంలో ఆవరించి ఉన్నాయని వాటిని నివారించుకోవాలంటే శమదమాలు, దయ, దానగుణం అనే మంచి లక్షణాలను మానవులు పెంపొందించుకోవాలని బృహదారణ్యకోపనిషత్తు ఒక చక్కని కథ రూపంలో వివరించింది.
పురాతన కాలంలో దేవ, దానవ, మానవుల మధ్య తరచుగా సంఘర్షణలు జరిగేవి. వాటి వలన అనేకులు చనిపోవడం, అంగ వైకల్యం పొంది దుర్భర జీవితాలు అనుభవించడం జరిగేది. ఈ పరిస్థితులను అధిగమించి అందరూ సుఖశాంతులతో జీవించాలనే ఉద్దేశ్యంతో వాళ్ళలో పెద్దవారైన ప్రతినిధులందరూ కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి తరుణోపాయము అడిగారు. వారి మాటలు విని సంతోషించి బ్రహ్మ దేవుడు ”మీరు అందరూ కొంతకాలం నా ఆశ్రమంలో ఉండి, సంయమము, బ్రహ్మచర్యము పాటిస్తూ, మీ ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోడానికి తపస్సు చేయండి. మీ ఆచరణ, దీక్ష, నిష్ఠలను గమనించి, త గిన సమయంలో మీరు మీ సంఘర్షణల నుండి బయటపడి, సుఖశాంతులతో జీవించడానికి తగిన ఉపాయాన్ని ఉపదేశిస్తాను అని చెప్పాడు. సరేనని వారందరూ నియమ నిష్ఠలతో తపస్సు చేయసాగారు. క్రమంగా వారిలో వైర భావాలు నశించి, సత్త్వ గుణం పెంపొంది, శాంతి, దాంతి, దయ అనే భావాలను అనుభవించ సాగారు.
ఆ తర్వాత ఒకనాడు బ్రహ్మదేవుడు తొలుత దేవతలను ఆ తర్వాత వరుసగా మానవులు, దానవులను అంతర్గత ప్రేరణ ద్వారా పిలుపించుకుని ‘ద’ అని ఉచ్చరించి, మౌనం దాల్చాడు. దీంతో దేవతలకు ‘ద’ శబ్దం ఘంటారావంగా దేవతల చెవులలో ప్రతిధ్వనించింది. ఇంద్రియ భోగాలను అనుభవించడమే పరమార్థమని భా వించి భోగలాలసులైన దేవతలకు ‘ద’ అనే శబ్దం, ఇంద్రియ దమము, అంటే నిగ్రహము (దమ్యత) కలవారు కండి అని బ్ర#హ్మ బోధించాడని అర్థం చేసుకొని, ఇంద్రియ నిగ్రహంతో ఈర్ష్య, అసూయలను జయించగలమని భావించి, బ్రహ్మ వద్ద సెలవు తీసుకొని సుఖశాంతులతో జీవించసాగారు. ఇంద్రియ నిగ్రహం సకల దు:ఖాలను పోగొట్టి సకల సుఖాలను ఇస్తుంది. ఎలాగంటే ”ఆపదాం కథిత: పంథా, ఇంద్రియాణాం అసంయమ:/ తజ్జ య: సంపదాం మార్గ:, యేనేష్టింతే సగమ్యతామ్‌ ”. ఇంద్రియ నిగ్రహం లేని వానికి అన్నీ ఆపదలే. విజితేంద్రియులకు అన్నీ సంపదలే. కనుక నీవే మార్గం ఎన్నుకొంటావో యోచింపుము అంటుంది పై సుభాషితం.
అలాగే, మానవులను పిలుపించుకుని, గంభీర స్వరంతో ‘ద’ అని పలికి, మౌనం దాల్చాడు. ఆ ధ్వని వినిన మానవ ప్రతినిధులు పూర్వజన్మల కర్మలు అనుభవించడానికే మానవ జన్మనెత్తిన మనం స్వార్థపరులమై, ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని, అసూయ ద్వేష గుణాలతో కలహించుకొంటున్నాము. స్వార్థం, లోభ గుణాలు కల్గిన మనకు బ్రహ్మ ‘ద’ అంటే (దత్త) దానం చేయండని ఉపదేశమిచ్చాడు అని అనుకున్నారు. దాన గుణం
విధిష్టమైనది. ఆశ, స్వార్థం, మమకారం వంటి అవగుణాలన్నీ దాన ధర్మాలు చేయటం ద్వారా జయించ వచ్చని భావించి, బ్ర#హ్మ వద్ద సెలవు తీసుకొని సుఖశాంతులతో జీవించసాగారు. దానగుణం ఎంత గొప్పది అంటే ”గౌరవం ప్రాప్యతే దానాత్‌ , నతు విత్తస్య సంచయాత్‌ / స్థితిరుచ్చై: పయో దానాం, పయోధీ నాం అథ స్థితి: ”. దానం చేయడం వల్లనే ఉన్నత స్థితి లభిస్తుంది. పిసినారి తనంతో కూడబెట్టుకోవడం అథమ స్థితికి దారి తీస్తుంది. ఎలాగంటే నీటిని ధారపోసే మేఘాలు ఆకాశంలో ఉంటాయి. నీటిని ప్రోగు చేసుకొనే సముద్రాలు పాతాళంలో ఉంటాయి కదా!
ఆ తర్వాత దానవులను పిలుపించుకున్న బ్రహ్మ తన గంభీర స్వరంతో ‘ద’ అని పలికి మౌనం వహించాడు. ఆ దివ్యాక్షర శబ్దం దానవులలో ప్రవేశించింది. మొదటినుండీ హింసా ప్రవృత్తి, కామ, క్రోధాలు కలిగిఉండి వారు తమ జీవితాలను అశాంతితో దు:ఖమయం చేసుకొన్నామని గ్రహించారు. పితామహుడు ఉచ్చరించిన ‘ద’ అనే శబ్దం యొక్క అర్థం దయాధ్వం, అంటే ఎల్ల ప్రాణులయెడ దయ కలిగి ఉండటం అని దానవులు అర్థం చేసుకొన్నారు. హింస అనేది అధర్మమైతే దయాగుణం ధర్మం యొక్క ఉత్తమ రూపం. దయ కల్గినవారు అహింస, ఔదార్యం, క్షమ వంటి సద్గుణాలతో భాసిల్లుతారు అని అర్థం చేసుకొని, సెలవు తీసుకొని తమ లోకానికి వెళ్ళారు. ”యస్య చిత్తం ద్రవీభూతం, కృపయా సర్వ జంతుషు / తస్య జ్ఞానే న, మోక్షేణ, కిం జటా భస్మ లేపనై:”. ఎవని మనసు సకల ప్రాణుల పట్లా దయతో ద్రవీ భూతమై ఉంటుందో వానికి జ్ఞానము, మోక్షము, జటా వస్త్రములు, భస్మానులేపనంతో పనిలేదు. ఒక్క సర్వ భూత దయ ఉంటే అదే ముక్తి ప్రదము అని అర్థం.
టీ.ఎస్‌.ఇలియట్‌ అనే ఆంగ్ల కవి, నాటక రచయిత, 434 పంక్తుల దీర్ఘ కవితను వ్రాసి, ”ద వేస్ట్‌ ల్యాండ్‌” అనే పేరుతో, 1922వ సంవత్సరం డిసెంబర్‌లో పుస్తక రూపంలో విడుదల చేశారు. బ్రిటీష్‌ వారి మతపరమైన కథలలో ”హూలీ గ్రెయిల్‌” (పవిత్ర పాత్ర)ను సంరక్షించడానికి నియుక్తులైన బ్రిటీష్‌ రాజుల పరంపరలో చివరి వాడైన ఫిషర్‌ కింగ్‌ అనారోగ్యం పాలై, తన రాచరికపు విధులు సరిగ్గా నిర్వర్తించలేక పోతాడు. అందువలన ఆ రాజ్యపు భూములు వర్షపాత రహితమై, బంజరు భూములుగా మారి, ప్రజలు కష్టాల పాలవుతారు. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన, దైవంపట్ల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతాయి. ఈ అంశాన్ని 20వ శతాబ్దపు పరిస్థితులకు అన్వయిస్తూ, మొదటి ప్రపంచ యుద్ధం, స్పానిష్ ఫ్లూ వలన లక్షలాది మంది ప్రజల చావును, కష్టాలను చూసిన ఇలియట్‌ కవికి ఐరోపా ఖండం కూడా ఒక బంజర్‌ నేలలా కన్పించిందని వివరిస్తూ, ఈ కావ్యంలో తీవ్ర బాధను వ్యక్తపరుస్తాడు. ఆధునిక సమాజంలో యుద్ధ భయం, భోగలాలసత, ఆధ్యాత్మిక భావ రాహిత్యం, దైవ భక్తి లేకపోవడం ఇలియట్‌ను కృంగదీశాయి. స్త్రీ పురుష సంబంధాలు కేవలం భౌతిక భోగంగా మారాయి. వారి మధ్య ప్రేమానురాగాలు, పవిత్రతలు లేవు. శృంగారం కూడా యాంత్రికమైంది. దు:ఖం ఆవరించి, సంతోషం ఆవిరై, బ్రతికి ఉన్నా మనిషి చచ్చినవాడైపోయాడు. ఈ దురదృష్ట పరిస్థితి అంతమై క్రొత్త జీవితం ప్రారంభం కావాలి. మరలా భూమిపై ఆధ్యాత్మిక చినుకులు కురిసి, భక్తి విశ్వాసాలు మొలకెత్తి, దైవారాధన పంటగా పండాలి. ఇలియట్‌ ప్రపంచ భాషలలోని సాహిత్యాలలో ఉన్న గొప్ప గొప్ప వాక్యాలను యథాతథంగా తన ఈ కవితలో ఉపయోగించాడు. ఉపనిషత్తుల, బౌద్ధ సాహిత్యంలోని మరియు హూమర్‌, డాంటే, షేక్స్పియర్‌, ఇతర కవుల రచనలలోని వాక్యాలు మనకు ఈ కావ్యంలో కన్పిస్తాయి. ది వేస్ట్‌ లాండ్‌ కావ్యం చివరలో కవి ద, ద, ద, అనే శబ్ద ప్రయోగం చేసి ముగిస్తాడు. దత్త (ఇవ్వడం), దయత్వం ( దయ చూపడం), దమ్యత (నియంత్ర ణ) అని వాటి అర్థం. భగవదారాధన, ఆధ్యాత్మికత, దయ, అంత: కరణ, దాన గుణం, ఇంద్రియ నిగ్ర#హం ప్రజలలో నెలకొన్న నాడు మరలా ధార్మిక వర్షాలు కురిసి, బంజర్‌ నేలలు సాగు భూములై, పంటలు పండి, సుఖశాంతులు వెల్లివిరుస్తాయనే ఉపనిషద్వాణినే ఇలియట్‌ తన కథావస్తువు చేసుకొన్నాడు.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
Advertisement

తాజా వార్తలు

Advertisement