తిరుమల, ప్రభ న్యూస్ : రెండేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్ళుగా దర్శన టికెట్లు కలిగిన భక్తులనే తిరుమలకు అనుమతించిన టిటిడి మంగళవారం నుంచి దర్శన టికెట్లు లేనప్పటికి భక్తులను తిరుమలకు అనుమతించడంతో కొండ పై భక్తజన సందడి నెలకొంది. భక్తుల రద్దీ పెరగడంతో టిటిడి వైకుంఠం క్యూ కాంప్లెక్సులోకి భక్తులను అనుమతించింది. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్ధం పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి చేరుకోవడంతో సర్వదర్శనం టోకెన్లను జారి చేసే కేంద్రాల వద్ద వేలాది మంది భక్తులు క్యూ లైన్‌లలో భారులు తీరారు. టోకెన్లను జారి చేసే కేంద్రాల వద్ద ఆరకొర సౌకర్యాలు ఉండడంతో టోకెన్ల కోసం గంటల తరబడి క్యూ లైన్‌లలో వేచివుండలేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవ్వగా మరికొంత మంది భక్తులు క్యూ లైన్‌లో జరిగిన తోపులాటలలో గాయాల పాలయ్యారు. వృద్దులు, చంటిపిల్లలు అయితే క్యూ లైన్‌లలో జరిగిన తోపులాటలలో ఉక్కిరిబిక్కిరి అవ్వగా కొంత మంది భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. టిటిడి అంచనా వేసిన దానికంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు టోకెన్లు జారి చేసే కేంద్రాల వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపుతప్పుతుండడంతో అప్రమత్తమైన టిటిడి, పోలీసు యంత్రాంగం దర్శన టోకెన్లు లేక పోయినా భక్తులకను తిరుమలకు అనుమతిస్తామని ప్రకటించడంతో ఒక్కసారి అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. క్యూ లైన్‌లో వేచిఉన్న భక్తులంతా అక్కడి నుంచి బయలుదేరి తిరుమలకు వచ్చేయడంతో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరిగింది. వేలాదిగా భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తుండడంతో అప్రమత్తమైన టిటిడి యంత్రాంగం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాల కల్పన పై దృష్టి సారించి రెండేళ్ళుగా వైకుంఠం క్యూ కాంప్లెక్సును ఖాళిగా ఉంచడంతో వెంటవే అధికారులు అక్కడికి సిబ్బందిని పంపించి క్యూ కాంప్లెక్సులోని కంపార్టు మెంట్లను శుభ్రపరిచి శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులను క్యూ కాంప్లెక్సులోని కంపార్టుమెంట్లలోకి అనుమతించారు. లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి టిటిడి భక్తులను క్యూ కాంప్లెక్సులోకి అనుమతించింది. క్యూ లైన్‌ల వద్ద తోపులాటలు జరగకుండా పోలీసుల సహాయంతో టిటిడి క్యూ లైన్‌ల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసింది. మరో పక్క టిటిడి విజిలెన్స్ సిబ్బంది క్యూ లైన్‌ల గుండా భక్తులు క్యూ కాంప్లెక్సులోకి వెళ్ళే చర్యలు తీసుకున్నారు. శ్రీవారి దర్శనార్ధం టికెట్లు లేకుండా తిరుమలకు వస్తున్న భక్తులకు బుధవారం వేకువజాము నుంచి దర్శనాన్ని కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది. దీంతో 12 గంటలకు పైగా భక్తులకు కంపార్టుమెంట్లలలోనే వేచివుండాల్సి రావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కంపార్టు మెంట్లలోనే అన్నపానీయాలను సరఫరా చేసెేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తిరుమల కొండ పైదాదాపు 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం కోసం కంపార్టుమెంట్, నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్‌లలో వేచివుండే సౌలభ్యం ఉండడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంపార్టు మెంట్లలో వేచివున్నారు. అయితే ఇక్కడ వేచివున్న భక్తులకు టిటిడి త్రాగునీరుతో పాటు పాలు, అన్నప్రసాదాలను సరఫరా చేయాల్సి ఉంది. గత రెండేళ్ళుగా క్యూ కాంప్లెక్సును మూసివేసి ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలి చేయడంతో ప్రస్తుతం టిటిడికి సిబ్బంది కొరత ఏర్పడింది. దీనిని అధిగమించి కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు టిటిడి సమయానికి అన్నపానీయాలను సరఫరా చేయకపోతే తిరిగి కంపార్టు మెంట్లలో కూడా భక్తులు నిరసనలకు దిగే అవకాశం కనిపిస్తుంది. ఊహించని విధంగా భక్తులను క్యూ కాంప్లెక్సులోకి అనుమతించాల్సి రావడంతో ఇప్పటికిప్పుడు సిబ్బందిని డిప్యూటేషన్ పై పంపే అవకాశం లేక పోవడంతో ప్రస్తుతం టిటిడి శ్రీవారి సేవకుల సహాయంతో క్యూ కాంప్లెక్సులో భక్తులకు అన్నప్రసాదాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ వారాంతం వరకు వరుస సెలవులు ఉండడంతో పాటు ఎల్లుండి తమిళులకు నూతన సంవత్సరాది కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ వారాంతం వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భక్తుల రద్దీ త గ్గే వరకు టిటిడి టోకెన్లు లేకున్నా భక్తులను దర్శనానికి అనుమతిస్తుందో లేదో అన్నదాని పై టిటిడి నుంచి క్లారిటి రాలేదు. ప్రస్తుతం టిటిడి ఉన్నతాధికారులు చెన్నై పర్యటన లో ఉండడంతో వారు తిరుమలకు చేరుకున్నాక టోకెన్ల జారి అంశం పై క్లారిటి వచ్చే అవకాశం కనిపి స్తుంది. కాగా రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్సు వద్ద అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి తనిఖీలు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు క్యూ లైన్‌లలో వేచివున్న భక్తులకు అన్నప్రసాదాలు అందేవిధంగా చూడాలని ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement