తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని వారికి 12 గంటల్లో సర్వదర్శనం కలుగనుంది. నిన్న స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.30 కోట్లు వచ్చిందని వివరించారు.
మొదటిరోజు శ్రీ సీతారామలక్ష్మణులు తెప్పపై విహారం
తిరుమల : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.