సృష్టి క్రమము, ప్రపంచ పుట్టుక, అభివద్ధి, లయం మొదలగునవి మీ ద్వారా వినాలని ఉందని విదురుడు మైత్రేయుని కోరాడు. అంత మైత్రేయుడు శ్రీకృష్ణుడు అవసానదశలో నాకు బోధించిన సృష్టివిజ్ఞానాన్ని నీకు తెలియజేస్తానని తెల్పుతూ ఈవిధంగా విశదపరచాడు.
”ఓధర్మాత్మా విదురా! విష్ణుదేవుని యోగ మాయ చేత ఈ ప్రపంచం, వృద్ధి, వినాశనం ఈ మూడూ ప్రాదుర్భవించాడు. ఈ విశ్వంలో గల చరాచరా జీవులన్నీ భగవంతుని స్వరూపాలు. భగవంతుడు తనలోని ప్రపంచాన్ని తనలోనే ధరించి అద్వైతుడే ప్రకాశిస్తాడు. తానే సర్వము కాబట్టి ద్రష్టకాడు. కానీ ప్రపంచాన్ని నిర్మించాలన్న కోరిక వల్ల తనకుతానే లేనివాడుగా భావించుకుని సృష్టిని చేసి అప్పుడు ద్రష్టగా మారి తాను సృజించిన చరాచరాన్ని వీక్షిం చడం మొదలుపెట్టాడు. సృష్టి చేయాలని సంకల్పం చేయగానే కార్యాకారణాల రూపము ‘మాయ’. అవిద్యగా ప్రకాశించ మొదలుపెట్టింది. తన అంశ నుండి ఆవిర్భవించిన మాయను తన శక్తిగా ప్రతిష్టించి భగవంతుడు తనలో ఉన్న విశ్వాన్ని ఉద్భవింపజేశాడు. భగవంతుడు మాయ నుండి మహాత్తత్త్వా న్ని పుట్టించాడు. ఈ తత్త్వము నుండి కాలము జనించినది. కాలము నుండి కారణం, కార్యం, కర్త అనునవి ఏర్పడి అవి తిరిగి పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సుగా రూపొంది నవి. ఈ మూడు రూపాంతరాలు సత్త్వ రజస్తమో గుణాలతో మిళితమైన అహంకారంగా ఏర్పడినది.
సాత్విక అహంకారంవల్ల మనస్సు, ఇంద్రియాల అధి దేవతలైన దేవతాగణాలు ఉద్భవించాయి.
రాజ సాహంకారం వల్ల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియా లు ఏర్పడినాయి.
తామసాహంకారం వల్ల శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అను పంచతన్మాత్రలు ఆవిర్భవించాయి. తిరిగి శబ్దం వల్ల ఆకాశం పుట్టింది. ఆకాశం కాలమనే మాయ యోగంతో భగవంతుని నిరీక్షణలో స్పర్శతన్మాత్ర వల్ల వాయువు పుట్టిం ది. రూప తన్మాత్ర వల్ల తేజస్సు జనించింది. రసతన్మాత్ర వల్ల జలం జనించింది. గంధ తన్మాత్ర వల్ల పృథివి ఏర్పడింది. పంచ భూతాలయిన ఆకాశానికి శబ్దం, వాయువున శబ్ద స్పర్శ లు, జలానికి శబ్ద స్పర్శ రూప రసాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ,
పృథివికి శబ్ద స్పర్శ రూప రసగంధాలు గుణాలుగా ఉన్నాయి. ఈ మహాతత్త్వాలు, పంచ భూతాలు, పంచేద్రియా లు, పంచతన్మాత్రలు వేరువేరుగా ఉండి సమైక్యం కాకపోవ డంతో ప్రపంచం సృష్టించడానికి సామర్ధ్యం చాలలేదు.
అంత అధి దేవతలైన దేవతా గణాలు మహావిష్ణు స్వరూ పాన్ని పరిపరి విధాల స్తుతించారు. ”సత్త్వ రజస్తమో గుణా లకు మూలమైన మాయచే మహత్తత్వమైన నీ తేజస్సును ప్రవేశపెట్టి సృష్టి కారకుడైనావు. నీ అంశలమైన మేము కాలా నుసారంగా ఏవిధంగా నిన్ను సంతోషపరచగలము? మాకు ఆహారం ఏమిటి? మేము ఏవిధంగా వర్తించాలి? మా స్థితి ఎక్కడ? జగత్తును సృష్టించి విస్తరించే శక్తిని ప్రసాదించు, తదు పరి అందరిని రక్షించు” అని ప్రార్థించారు. ఇక్కడ ఆహార మంటే విధి.
అధి దేవతల మొరనాలకించిన శ్రీ మహావిష్ణు మహత్తు, అనేక తత్త్వాలకు సమన్వయం లేక అసంపూర్ణమయిందని, కాల వేగంతో ప్రకృతితో కూడిన చైతన్యశక్తిని నిక్షేపించి ఇర వదియేడు తత్త్వాలలో ఏక కాలంలో ప్రవేశించి వాటిని సమ న్వయం చేసి ఏకత్వం కలిగించాడు. పంచభూతాలు, పంచతన్మాత్రలు, దశేంద్రియాలు, కాలం, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి చిత్తం, అహం కారం. ఈ ఇరవదియేడు తత్త్వాల వల్ల సకల చరాచరములు జనించాయి. వాటిలో నరుడు పరమోత్కృష్టుడు. అంత:క రణ చతుష్టయాలను గుర్తించగలిగిన చైతన్యుడు. ఈవిధంగా ప్రపంచాన్ని నిర్మించి స్థితి కల్పించడంలో తత్త్వాలకు నేర్పును కలిగించాడు. మహా తత్త్వాలు ఒక దానితో నొకటి ఏకీభావం పొంది అనేక రూపాలను ధరించాయి. విష్ణు వు మాత్రం సమస్త జీవులలో నిండియున్నవాడు అయినాడు. ఈ సమస్త మహత్కార్యం ముందుగా బ్రహ్మాండం అనే గర్భ రూపంతో మొదలయింది. అధ్యాత్మం, అధి భూతం, అధి దైవం అనే మూడు బేధాలు కలిగిన ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలగుతుంది. కల్పాంతంలో సృష్టి సమస్త లయమవుతుంది.
ఈశ్వరాంశలైన దిక్కులు శ్రవణంద్రియాలైన చెవులకు శబ్ద జ్ఞానాన్ని, వరణుడు రుచిని, అశ్వినీ దేవతలు వాసనను, పరమ పురుషుడు స్పర్శను, మిత్రుడు వాయువుతో కలిసి విస ర్జనను, ఇంద్రుడు చేతుల ద్వారా జీవనోపాధి శక్తిని, విష్ణువు కాళ్ళకు గమన శక్తిని, పరమేశ్వరుడు హృదయాన్ని, రుద్రుడు కర్తవ్య నిర్వహణ శక్తిని, వాగేశ్వరుడు జ్ఞానశక్తి, గ్రహణ శక్తి, బ్రహ్మ చిత్తమునందు చేరి చైతన్యము నొంది విజ్ఞానాన్ని జీవు నకు ప్రసాదిస్తున్నారు. విరాట్ పురుషుడైన శ్రీ మహావిష్ణువు శిరస్సు నుండి స్వర్గ ము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము ఉద్భవిం చాయి. త్రిగుణాల వల్ల జీవులు అమరులయ్యారు. సత్త్వ గుణం చేత దేవతలు స్వర్గాన్ని, రజోగుణం వల్ల మానవులు, గోవులు మొదలైన జీవులు భూమిని పొందారు. ఇక తమో గుణం వల్ల జీవులు నరకాన్ని ఇక్కడే చూస్తారు.
– వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269