ఓ పక్క భారీ ఏర్పాట్లు.. మరో పక్క భక్తుల రద్దీ, అదుపుపై ప్రభుత్వవర్గాల తర్జనభర్జన
కేసుల క్షీణత, వ్యాప్తిని బట్టి మొదటివారంలో నిర్ణయం
లక్షలాది భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు
అరగంటలో దర్శనం పూర్తయ్యేలా ప్రణాళికలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌కు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తుం డగా, లక్షలాదిమంది మహాజనసంద్రంగా మారి ఒక్కచోటకు చేరే ఈ జనజాతరను ఎలా నిర్వహించాలన్నదానిపై ప్రభు త్వవర్గాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగే జాతర కోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, కొవిడ్ ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లు, నిర్వహణపై సందిగ్దంలో పడింది. ఓ వైపు కేసుల సంఖ్య అధికారికంగా ప్రతిరోజూ 4వేలకు పైగా నమోదవుతుండగా, సామూహికంగా వ్యాప్తి జరిగిపోయింది. ఇక ఫిబ్రవరి మొదటివారానికి ఈ కేసుల తీవ్రత తగ్గితే.. ప్రజలు భారీగానే వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు ఈ జాతరను అత్యంత వైభవంగా జరపనుండ గా, భక్తజనం తెలంగాణ నుండే కాకుండా పొరుగున ఉన్న గిరిజన రాష్ట్రాల నుండి లక్షలాదిగా హాజరవుతారు. అయితే కొవిడ్ ఉదృతిని దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడమా లేదా కఠిన ఆంక్షలు విధించ డమా? అన్నది త్వరలో నిర్వహించే సమీక్షా సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ జాతరకు ప్రతీసారి ముఖ్యమంత్రి వెళ్ళడం ఆనవాయితీ కాగా, ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళనున్నారు. గత వారం వైకుంఠ ఏకాదశి పర్వది నం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల్ని అనుమ తించలేదు. అలాంటిది.. నాలుగు రోజుల జాతరకు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో నిర్వహణ ఎలా? అనే ప్రశ్నలు ప్రభుత్వవర్గాలలో తలెత్తుతు న్నాయి. జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా. వచ్చి, పోయే వారిని మినహాయించినా ఒకే సమ యంలో ఒకే ప్రాంతంలో లక్షల మంది గుమిగూడే అవకాశం ఉంటుంది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించినా.. అమ్మవార్ల దర్శనానికి భక్తులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి ఉంటుంది. మహా జాతరలో భౌతిక దూరం పాటించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో జాతర నిర్వహణపై గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్య, దేవాదాయశాఖ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకోనున్నారు. రెండేళ్ళకోసారి జరిగే జాతర కు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
ఫిబ్రవరి 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
జాతరకు రూ.75 కోట్లు
మేడారం జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. భక్తులందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి రావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం తరఫున మాస్కులను భక్తులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక అరగంటలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విడత దేశ, విదేశీ భక్తులు ఎక్కువ మంది రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుండగా, 8వేలకుపైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.