Tuesday, November 26, 2024

నిరంతర అన్వేషణ

శాస్త్రవేత్తలు కొత్త విషయాలు కనుగొనడానికి నిరంతరం అన్వేషణలో ఉంటారు. ఋషులు, యోగులు నిరంతరం
జ్ఞానాన్వేషణలో ఉంటారు. నేటి సమాజంలో మానవులు సంపదను ఎలా కూడబెట్టాలి? భావితరాలకు సరిపడే డబ్బు ఎలా సంపాదించాలి? వంటి ఆలోచనలతో, అధర్మమైనా అన్యాయం ఆయినా పోగు చేసుకోవాలనే ఆలోచనలతో మనస్సును అల్లకల్లోలం చేసుకొంటూ, మనశ్శాంతికి దూరం అవుతున్నారు. దీనివల్ల సమాజంలో నైతికత లోపించింది. మనకు కావలసింది డబ్బు అన్వేషణ కాదు. జ్ఞానాన్వేషణ చాలా ముఖ్యం. జ్ఞానం ఎప్పుడైతే మనకు సిద్ధిస్తుందో అపుడు, మనలోని అహంకారం, వ్యామోహం తొలగిపోతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ”నహ జ్ఞానేన సదృశం పవిత్ర మిహ మిద్యతే” అని అన్నారు. అంటే అన్నిటికీ మూలం జ్ఞానమే అని. అటువంటి జ్ఞానం కొరకు అన్వేషణ చేయాలి. ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌, తన రెండు చేతులు పైకి పెట్టించి సమాధి అయ్యాడు. అంత సంపాదించిన అలెగ్జాండర్‌ ఒట్టి చేతులతో
వెళ్ళిపోయాడు అని శిలాశాసనం వేయించాడు. ఇది అందరికీ కనువిప్పు కలిగించే అంశం. ఎందుకంటే ధర్మం గానో అధర్మం గానో ఎంత సంపాదించినా కూడా ఏదీ రాదు. నీతో నువ్వు చేసుకొన్న పుణ్యం మాత్రమే వస్తుంది. అందుకే మనం ధర్మాన్ని, సత్యాన్ని, వదలకుండా నడవగలిగితే మనిషికి జీవన సాఫల్యం సిద్ధిస్తుంది. జ్ఞానాన్వేషణలో ఉన్న యాజ్ఞవల్క్య మహర్షి, పిప్పలాద మహర్షిని వెతుక్కుంటూ వచ్చిన భరద్వాజుడు, సుకేశుడు, గార్గ్యుడు వంటి ఆరుగురు ఋషులు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, యోగానంద వంటి ప్రముఖులు చరిత్రలో లిఖించబడ్డారు. అందుకే మనం ఆలోచించి, ధర్మాన్ని అనుసరించి జ్ఞానేన్వేషణలో ఉందాం. తైత్తిరీయోపనిషత్తులో వరుణ మహర్షి పుత్రుడు భృగువు తండ్రిని సమీపించి ”నాన్నగారు! జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు దానికి బదులిస్తూ వరుణమహర్షి ”ప్రాణం, ఆహారం, జ్ఞానేంద్రియాలు, మనస్సు, వాక్కు ఇవే పరమాత్మ. ఆ పరమాత్మ లీలలను కనుగొనడమే జ్ఞానం అని వివరించారు. దానివల్ల మనం సాధించవలసిన నాలుగు ఆశ్రమ ధర్మాల్లో, ఆఖరిది వాన ప్రస్థాశ్రమం ద్వారా సాధ్యమే. ముక్తికి మార్గం అదే.

  • అనంతాత్మకుల రంగారావు
Advertisement

తాజా వార్తలు

Advertisement