భావాతీతం, గుణాతీతం అయిన అమ్మవారి అగ్ని రూపంలో కొల్చుకునే ప్రదేశం ఒకటుంది. అదే హమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో కాంగ్రాలోయలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం ‘జ్వాలముఖి. ఉత్తర భారతీయులు జ్వాలాజీగా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 610 మీటర్ల ఎత్తులో ఉన్న సివ్లూ ధర్మశాల హవేపై, కాంగ్రా పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహతుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలేకాక, మహాకాళి, అన్నపూర్ణ, చండి, హంగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి అనేవి ఈ తొమ్మిది జ్వాలాదేవతల పేర్లు. అమ్మ వారిని మనం కోరుకున్న రూపంలో మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటాము. కానీ ఆదిశక్తికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపూ ఆమెదే! జ్వాలాముఖి గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తాను దహించివేసుకుందనీ, అలా దహించుకుపోయిన శరీరాన్ని పరమశివుడు భుజాన వేసుకుని తిరుగుతుండగా విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని సతీదేవి శరీరంపై ప్రయోగించగా, ఆవిడ శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందని చెబుతారు. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని నమ్ముతారు. వాటిలో ఒకటే హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందట, అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఈ మంట వెనుక కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టదు. దీనివెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు సైతం భంగపాటుకు గురికాక తప్పలేదు. జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహానికి బదులుగా కొండ గోడల నుంచి, చిన్న నీటి కుండం గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు. శ్రీ యంత్రం ఉన్న ప్రదేశంలో ఎర్రని శాలువతోను బంగారు ఆభరణాలతోనూ కప్పి ఉంచుతారు. శ్రీయంత్రానికి ఎర్ర వస్త్రం, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్కు మతస్థులు వివాహాలు నిర్వ#హంచడం అధిక సంఖ్యలో కనిపిస్తుంటుంది. అలాగే నూతన వధూవరులు అమ్మవారి దర్శనార్థం రావడం కూడా ఉంది. ఇనుప గేట్లు కట్టిన నీటికుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు గోరఖ్‌నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తుంటారు, మందిర ప్రాంగణంలో ఉన్న గోరఖ్‌నాథ్ మఠం దగ్గర కింద రాతి నుండి వస్తున్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనుప గేట్లు కట్టిన నీటికుండంలో నీటిలోంచి వస్తున్న జ్వాలలు పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్దపెద్ద పళ్ళాలలో పళ్ళు, పూలు, పసుపు కుంకుమ ఎర్రవస్త్రంతో పాటు తీపి వంటకాలను సమర్పిస్తుంటారు. అమ్మవారి భక్తులలో అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది.
- దైతా పద్మలత