Friday, October 18, 2024

…ఏకాగ్రత!

క్రమశిక్షణ అంటే ఒక ధ్యానం, క్రమశిక్షణ అంటే తపస్సు. జీవితంలో క్రమశిక్షణ లేనప్పుడు ఆనందం ఉండదు. ధనం ఒక్కటే సంతోషాన్నివ్వదు. సంతృప్తి చెందకుండా ఇంకా ఇంకా ఏదో కావాలనుకుంటూ లేనిపోని సమస్యలు తలకెత్తుకుంటారు. జీవితంలో క్రమశిక్షణను అవలంబించాలి. ఈ రోజు నేను ఈ పని పూర్తిచేస్తాను అని ఏకాగ్రతలో కూర్చుని పూర్తిచేయాలి. అలా అభ్యాసం అవుతుంది. అందుకే మండలదీక్ష (40 రోజులపాటు)లు ఉంటాయి. మనస్సు చంచలంగా ఉంటే, ఏమీ సాధించలేరు. క్రమశిక్షణ ఉన్నప్పుడే ఏకాగ్రత కుదురుతుంది.
ఆహారం తీసుకునే సమయంలో కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది అనారోగ్యకరం. ముందు ఆహారం మీద ఏకాగ్రతను ఉంచి, ఆ పని కానివ్వండి. ఆరోగ్యం ముఖ్యం. మన దేశంలో క్రమశిక్షణ తక్కువ కావచ్చు. అలాగని విదేశాల్లో అక్షరాలా నూరుశాతం క్రమశిక్షణ అమలులో ఉందనుకుంటే పొరపాటు. కఠిన శిక్షలు అమలుచేసే దేశాలలో సైతం ‘చాప కింద నీరులా’ క్రమశిక్షణ ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఆయా దేశాలలో ఉండి వచ్చిన వారు చెబుతున్న నిజాలివి. క్రమశిక్షణ ఓ దేశానికి, మతానికి, కులానికి, ప్రాంతానికి పరిమితం కాదు. మానవులందరికీ అవసరమే. కొన్ని దేశాల్లో జీవన విధానం బాగుండదు. జీవితం మాత్రం సౌకర్యంగా ఉంటుంది. అన్ని సౌకర్యాలు సమయానికి అమరుతాయి. క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంది. క్రమశిక్షణ అంటే అదేదో శిక్షలాగానో, భయం కొల్పేదిగానో ఉండకూడదు. వాళ్ళంతట వాళ్లే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యచ్చో, ఏది చెయ్యకూడదో ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగేలా పెంచగలుగితే చాలు. ప్రతిక్షణం క్రమశిక్షణ పేరిట పిల్లల స్వేచ్చకు అడ్డుకట్టలేస్తే ఏదో ఒక క్షణంలో అదుపు తప్పి పోయే ప్రమాదం ఉంది. పరవళ్ళు తొక్కే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛను స్వార్థం కోసమే వాడుకునే సహజ మానవ నైజం జీవన విధానాన్ని కలుషితం చేస్తుంది.
కాలం మారింది, మారుతోంది. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు అన్నీ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు మాట్లాడుకోవడం, ఆడుకోవడం తప్పు. ఇప్పుడు కలిసి చదువుకుంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు. ఆ కాలంలో అది తప్పు అన్నారు కదా అని నేటి కాలానికి దాన్ని అన్వయించడం సరి కాదు. అలా అని విశృంఖలత్వాన్ని ప్రోత్స‌హించ‌కూడ‌దు. ఈ రెండిటిమధ్య సమన్వయం చేసుకుంటూ పిల్లలకి మంచి చెడుల మధ్య ఉన్న సన్నని రేఖని చూపించగలిగితే వాళ్లే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా అభివృద్ధి చెందుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒక రోల్‌ మోడల్‌గా ఉంటే పిల్లలు వాళ్ళని అనుసరిస్తూ మంచి వ్యక్తులుగా రూపొందుతారు. చెయ్యకూడని పనులు మనమే చేస్తూ, పిల్లల్ని చేయొద్దని శాసిస్తే మనముందు చెయ్యనట్టుగా నటిస్తూ చాటున అవే ఆచరిస్తారు.
యోగ సాధన చేయటం జీవితంలో క్రమశిక్షణను తెస్తుంది. కొన్ని పనులను ఒక ప్రత్యేకమైన విధానంలో చేస్తారు. క్రమశిక్షణ లేని వారు జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. విజయవంతం కావాలంటే ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయకూడదు. సమయం వృధా చేయవద్దు. క్రమశిక్షణ లేకుండా జీవితంలో విజయం సాధించలేరు. క్రమశిక్షణ ఎప్పుడూ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయకారి. ఒత్తిడికి కారణమయ్యే అనేక అంశాలను నియంత్రించవచ్చు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఆశావాద దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. క్రమశిక్షణ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. విద్యార్థులు క్రమశిక్షణ ఫలితంగా ధైర్యం, సంకల్పం పొందుతారు. విద్యార్థులు తమ జీవితంలోని అన్ని ఇతర అంశాలలో ఎక్కువగా పాల్గొంటారు. క్రమశిక్షణ భావన స్థిరత్వాన్ని నిలుపుకుంటుంది, తద్వారా విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించగలరు. క్రమశిక్షణ అనేది వారి లక్ష్యాలపై పని చేయడంలో సహాయపడటానికి విద్యార్థి జీవితంలో మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.
నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిజాయతీగా ఉండాలి. ఏ పని చేస్తున్నా అది ఎందుకు చేస్తున్నావో పూర్తి అవగాహన ఉండాలి. వీలైనంత వరకు సాధారణ జీవితం గడపాలి. సత్సాంగత్యం చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం కూడా ఉండాలి. దీని కొరకు మంచి అలవాట్లు చిన్న తనం నుంచి అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం కూడా ప్రశాంత జీవితానికి ఉపయోగపడుతుంది. అయితే, అన్నింటికీ మూలం ఏమిటి? సాధన, సాధన, సాధన. అదే క్రమశిక్షణ.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement